కరీంనగర్, జూన్ 13 (నమస్తే తెలంగాణ)/ కొత్తపల్లి: స్వామి వేషంలో అమాయక ప్రజలను నమ్మించి బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు దొంగబాబాలను కరీంనగర్ రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15.30లక్షల నగదు, ఏడు తులాల బంగారం, మూడు కార్లు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ వెల్లడించారు. కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ గజ్జి ప్రవీణ్ (25) వేములవాడ డిపోలో పని చేస్తున్నాడు.
15 రోజుల క్రితం ఒక ప్రమాదంలో అతడి ఎడమకాలు విరిగింది. అతడి తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకున్న స్వామిజీవేషంలో ఉన్న ఒక వ్యక్తి ప్రవీణ్ ఇంటి పక్కన క్వింటాల్ బంగారు కడ్డీ ఉన్నదని, దానిని బయటకు తీసి పూజలు చేస్తేనే ఆరోగ్యాలు బాగుంటాయని వారిని నమ్మించాడు. లేదంటే నెల రోజుల్లో ప్రవీణ్ తండ్రి కనకయ్య చనిపోతాడని బెదిరించాడు. అందుకు కావాల్సిన పూజా సామగ్రి కొనుగోలు చేయాలని విడుతల వారీగా 15.30లక్షల వరకు వసూలు చేశాడు. అంతేకాకుండా ఇంటి పక్క గొయ్యితీసి కుంకుమ, పసుపు చల్లి అందులో నుంచి ఒక డబ్బా తీశాడు. అందులో కిలో బంగారం ఉందని చెప్పి, పూజాగదిలో పెట్టించాడు.
ఆ తర్వాత ఇంకా డబ్బు కావాలని, లేదంటే కనకయ్యను చంపి ఇక్కడే పాతిపెడతామని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన ప్రవీణ్ మరికొంత డబ్బు అప్పుచేసి ఇచ్చాడు. తర్వాత మోసపోయానని గ్రహించి కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రగిరికి చెందిన ఈర్నాల రాజు, అగ్రహారానికి చెందిన మిరియాల దుర్గయ్య, చీర్లవంచకు చెందిన పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల సతీశ్ కోసం గాలింపు చేపట్టారు.
శుక్రవారం చింతకుంట ఎక్స్‌రోడ్ వద్ద కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు కార్లలో వేగంగా వస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. వారి వద్ద నుంచి 15.30లక్షలు, ఏడు తులాల బంగారం, మూడు కార్లు, ఏడు సెల్ఫోన్లు ఫోన్లు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ మాట్లాడుతూ, పూజలు చేస్తామంటూ స్వాముల వేషాలు వేసుకొని తిరిగే వారిని నమ్మవద్దని, నకిలీ స్వాములపై అప్రమత్తంగా హెచ్చరించారు. ఇలాంటి స్వాముల చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. కేసును చేధించిన సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్ఐ సాంభమూర్తిని సీపీ అభినందించారు.