బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి(Bengaluru Doctor).. తన భార్య, చర్మవ్యాధి డాక్టర్ కృత్తికా రెడ్డిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న పోలీసులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. భార్యను చంపిన తర్వాత తన లవర్‌కు డాక్టర్ మహేంద్ర మెసేజ్ చేశాడు. నీ కోసం నా భార్యను చంపాను అని మెసేజ్ చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఓ మహిళతో రిలేషన్లో ఉన్న ఆ డాక్టర్ తన డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లో ఈ మెసేజ్ చేసినట్లు తేల్చారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ చేసిన తర్వాత దీన్ని గుర్తించారు. ఆ మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ మహిళ ఎవరన్న విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా పబ్లిక్‌గా వెల్లడించలేదు.
డాక్టర్ కృతికా రెడ్డిని చంపిన ఆర్నెళ్ల తర్వాత డాక్టర్ మహేంద్రను అరెస్టు చేశారు. కృతికకు ఇంట్లోనే చికిత్స చేసిన భర్త ఆమెకు తెలియకుండానే అనస్తీషియా డ్రగ్‌ను ఇచ్చారు. ఏప్రిల్ 21వ తేదీన ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఫోరెన్సిక్ పరీక్షలో కొన్ని నిజాలు తెలిశాయి. ఆమె శరీరంలో అత్యంత శక్తివంతమైన ప్రొపొఫోల్ మత్తు మందు ఉన్నట్లు గుర్తించారు. దీని ద్వారా సర్జన్ మహేంద్ర హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇంట్లో ఇన్స్పెక్షన్ చేసిన సమయంలో కొన్ని కీలక ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.
తన అల్లుడే కూతుర్ని చంపినట్లు కృతిక తండ్రి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్టోబర్ 15వ తేదీన డాక్టర్ మహేంద్రను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది మే 26వ తేదీన ఆ డాక్టర్ల జోడి పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరూ బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో పనిచేశారు.