Allu Sirish | అల్లు కుటుంబం ప్రస్తుతం ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. కారణం అల్లు అరవింద్ చిన్న కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొంతకాలంగా ఆయన వివాహం గురించి వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తుండగా, తాజాగా శిరీష్ తన స్నేహితురాలు నయనిక రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను శిరీష్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “నా నిశ్చితార్థం నుంచి కొన్ని ప్రత్యేక క్షణాలను మీతో పంచుకుంటున్నాను. ఈ అందమైన రోజు కోసం కృషి చేసిన ఈట్ డ్రింక్ పార్టీ టీమ్‌కు ధన్యవాదాలు. ఈ వీడియోకు హృదయాన్ని తాకే సంగీతాన్ని అందించిన నా స్నేహితుడు జుడా శాండీకి ప్రత్యేక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
తాజా వీడియోలో నయనిక మాట్లాడుతూ “శిరీష్ ఒక చిన్న బేబీ లాంటోడు. చాలా కేరింగ్‌గా, ప్రేమగా చూసుకుంటాడు.. అది నాకు చాలా ఇష్టం” అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతుంది. నిశ్చితార్థ వేడుకలో అల్లు–మెగా కుటుంబం అంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి–సురేఖ, రామ్ చరణ్–ఉపాసన, వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చితార్థ కార్యక్రమంలో శిరీష్ తెలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకోగా, నయనిక ఎరుపు లెహంగాలో మెరిసిపోయారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక అల్లు శిరీష్, నయనిక వివాహం వచ్చే ఏడాది జరగనుందని అంటున్నారు. శిరీష్-నయనకది ప్రేమ వివాహం కాగా, వారిద్దరు నితిన్ భార్య ఏర్పాటు చేసిన ఫంక్షన్లో తొలిసారి కలిసారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇక పెళ్లి తర్వాత అల్లు శిరీష్ నటుడిగా కొనసాగుతారా లేదా అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన చివరిసారిగా 2024లో విడుదలైన యాక్షన్-కామెడీ ఫాంటసీ చిత్రం ‘బడ్డీ’ లో కనిపించారు. శిరీష్ సినిమాలపై శ్రద్ధ తగ్గించి బిజినెస్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.