ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇవ్వడం లేదా..?
ఉదయమో.. సాయంత్రమో.. కవర్లలో తీసుకెళ్లి రోడ్లపై పడేస్తున్నారా..?
లేదంటే దగ్గర్లోని ్లడంపర్ బిన్లలో వేస్తున్నారా..?
అయితే జాగ్రత్త! కరీంనగరాన్ని డంపర్ బిన్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు బల్దియా సంకల్పించింది. చెత్త పాయింట్లు, బిన్లలో చెత్త వేస్తే ఇక నుంచి జరిమానా విధించాలని నిర్ణయించుకున్నది. మొదటి సారి రూ.1000, రెండోసారి అంతకుమించి ఫైన్ వేయనున్నది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షించడంతోపాటు హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నది. వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తించి ఫైన్ వేయడం, నడిచివస్తే వారి ఫొటోలు తీసి రోడ్ల వెంట అతికించనున్నది.
కార్పొరేషన్, సెప్టెంబర్ 18: కరీంనగర్‌ను డంపర్ బిన్ ఫ్రీ సీటీగా మార్చేందుకు నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ చర్యలు చేపట్టారు. ఇంటికి వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు మాత్రమే చెత్త అందించాలని, రోడ్లపై, డంపర్ బిన్లలో ఇష్టం వచ్చినట్లుగా చెత్త వేయొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఇక నుంచి నిబంధనలు అతిక్రమించి రోడ్లు, బిన్లలో చెత్త పడేసే వారిపై జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏయే రోడ్లలో చెత్త ఎక్కువగా వేస్తున్నారో..? అధికారులు గుర్తించారు. ‘ఇక్కడ చెత్త వేయొద్దు. ఈ స్థలం సీసీ కెమెరాల పరిధిలో ఉన్నది.
చెత్త వేస్తే జరిమానా తప్పదు’ అని హెచ్చరికలతో కూడిన ప్లెక్సీలతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సీసీ కెమెరాల ద్వారా వాహననంబర్, యజమాని ఇంటి అడ్రస్‌ను గుర్తించి జరిమానాలు విధించేందుకు కసరత్తు చేస్తున్నారు. నడిచి వచ్చే వారిని గుర్తించి వారి ఫొటోలను ఆయా బిన్స్ వద్ద ప్రదర్శించే దిశగాను సమాలోచనలు చేపడుతున్నారు. నగరంలోని బస్టాండ్ వెనుక ఉన్న అండర్ గ్రౌండ్ డంపర్ బిన్ వద్ద ప్రతిరోజూ ఉదయమైతే చాలు చెత్త భారీగా పేరుకుపోయి కనిపిస్తుండగా, ఈ ప్రాంతంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఎవరెవరు చెత్త వేస్తున్నారన్న విషయాన్నీ పరిశీలిస్తున్నారు.
ఈ బిన్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇకపై అన్ని డంపర్ బిన్స్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కేవలం ఇంటి వద్దకు వచ్చే చెత్త రిక్షాలు, స్వచ్ఛ ఆటోలకు మాత్రమే చెత్త అందించాలని, కాదని రోడ్లుపై పడేసిన వారికి మొదటి సారి రూ.1000 జరిమానా, రెండోసారి మరింత భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో నగరంలో ఎక్కడా చెత్త పాయింట్లు, డంపర్ బిన్స్ అనేవి లేకుండా చేయడమే లక్ష్యంగా తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరిస్తున్నారు.