కొత్తపల్లి, సెప్టెంబర్ 10: ‘మాట్లాడితే చాలు పవర్ ఫుల్ మంత్రిని అని చెప్పుకొనే రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ ఏమైంది. ఎటు పోయింది..? స్థానికుడిని అంటున్నవ్. అధికారులతో సమీక్షలు పెడుతున్నవ్. మరి కరీంనగరానికి నిధులు ఎందుకు మంజూరు చేయిస్తలేవు. అసలు నువ్వు కరీంనగర్ జిల్లాకు మంత్రివా..? సిద్దిపేట జిల్లాకా చెప్పాలని’ కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఒకవేళ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాకే మంత్రి అయితే ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు నిధులు విడుదల చేసి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ రోజు వరకు కరీంనగర్ బల్దియాకు ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదని, అభివృద్ధి కుంటుపడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తినని చెప్పుకుంటున్న మంత్రి పొన్నం నిధులు విడుదల చేయక ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మూడు నెలల క్రితం నగరపాలక సంస్థపై పొన్నం నిర్వహించిన సమీక్షతో నగరానికి ఒరిగిన ప్రయోజనం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేని మీరు సమీక్షలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా నిధులు తీసుకురాకపోవడం చేతకాకపోతే గత ప్రభుత్వంలోని సీఎం అస్యూరెన్స్ నిధులనైనా విడుదల చేయించాలని సూచించారు.
రోజువారీ పనుల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో నగరంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. కరీంనగర్లో అభివృద్ధి అంటే అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో జరిగిందే తప్ప, కాంగ్రెస్ హయాంలో జరిగిందేమీ లేదన్నారు. అప్పటి మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ సహకారంతో కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా దక్కడంతో పాటు రూ.వెయ్యి కోట్ల నిధులు వచ్చాయన్నారు. ఇందులో రూ.800 కోట్లతో అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. దీనికి తోడు గంగుల, వినోద్‌కుమార్ సహకారంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.600 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేసి కరీంనగర్ అభివృద్ధికి పాటుపడ్డారన్నారన్నారు. గతంలో పొన్నం ప్రభాకర్‌ను కరీంనగర్ ప్రజలు ఓడించడంతోనే నగరానికి నిధులు ఇవ్వడం లేదని భావించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు సమీక్షలు అవసరం లేదని, అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. తాను పార్టీ మారుతారన్న ప్రచారంలో ఏ మాత్ర నిజం లేదని, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. స్మార్ట్‌సిటీ నిధుల విడుదలలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఎలాంటి అడ్డంకులు సృష్టించకపోవడంతోనే ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.