కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 20 : కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో ఐదు గ్రామాలతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నా.. ప్రభుత్వం మాత్రం విలీనానికే ముందుకు సాగుతున్నది. ఇప్పటికే నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు సైతం విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖకు లేఖ రాశారు.
ముఖ్యంగా ఇప్పటికే నగరపాలక సంస్థలో విలీనమైన ఎనిమిది గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి సాగలేదని, మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతి డివిజన్‌కు రూ.50 కోట్లకు పైగానే నిధులను ప్రభుత్వం కేటాయించాలని కోరారు. విలీన గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగకపోగా.. ఇప్పుడు కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్, గోపాల్పూర్, బొమ్మకల్, కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కపూర్ గ్రామాలను విలీనం చేయనున్నారు. ప్రస్తుతం 60 డివిజన్లు ఉండగా.. తాజాగా చేయనున్న విలీనంతో 66 డివిజన్లకు పెంచనున్నారు. అయితే, ఇక్కడి పరిస్థితులను పరిశీలిస్తే నగరపాలక సంస్థపై మరింత భారం పెరిగే ప్రమాదం ఉన్నది.
గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేస్తే ఏ మేరకు అభివృద్ధి సాగుతుందోనన్న అనుమానం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా గ్రామాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదమున్నది. అలాగే, గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిగా నిలిచిపోతుంది. దీని వల్ల గ్రామాల్లో కూలీలు ఇబ్బందులు పడతారు. మరోవైపు వివిధ పనులు ఆయా గ్రామాల్లోని కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వేగంగా పూర్తవుతున్నాయి. కానీ, నగరపాలక సంస్థలో విలీనమైన తర్వాత ప్రజలు తమ పనుల కోసం బల్దియా కార్యాలయానికి రావాల్సి వస్తుంది. దీంతోపాటు ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందన్న ఆందోళన కనిపిస్తున్నది.