ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు చుట్టు పక్కల పది జిల్లాలతోపాటు పక్క రాష్ట్రం నుంచి తాకిడి ఉంటున్నది. అయితే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు లేక మెరుగైన వైద్యం కోసం వరంగల్, హైదరాబాద్ దవాఖానలకు రెఫర్ చేయాల్సి వస్తున్నది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతున్నది. ప్రధానంగా ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లేక పేదలు ప్రైవేట్ చేయించుకోవాల్సి వస్తుండగా, ఆర్థిక భారం పడుతున్నది. నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తే మరిన్ని మరిని ప్రయోజనాలు అందుబాటులోకి రానుండగా.. అది ఇంకా కలగానే మిగిలింది. నేడు జీజీహెచ్‌లో దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం జరుగుతుండగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు కలెక్టర్, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో దవాఖానపై దయచూపాలని, మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు.
విద్యానగర్, జూన్ 17: కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా రోగు ల తాకిడి ఉంటుంది. అయితే, ఇక్కడి వైద్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేయించడంతోపాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే డి మాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్నది. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్యం కోసం కరీంనగర్ ప్రభు త్వ వైద్యశాలకు రోగులు వస్తుండగా.. ఇక్కడ సూప ర్ స్పెషాలిటీ సేవలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సదుపాయాలు లేవని వైద్యులు వరంగల్, హైదరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేస్తుండగా.. కొన్నిసార్లు మార్గమధ్యంలోనే ప్రాణా లు వదులుతున్నారు. కరీంనగర్ దవాఖా నలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.
జనరల్ హాస్పిటల్లో ఏన్నో ఏళ్ల నుంచి ఎంఆర్ఐ స్కానింగ్ లేక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్‌లో చేయించాల్సి వస్తుండడంతో ఆర్థిక భారం పడుతున్నదని, వెంటనే ఎంఆర్ఐను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. డిజిటల్ ఎక్స్‌రేలకు ఫిలింలు లేవని, ఎక్స్‌రే తీసుకునే ప్రతి పెషంట్‌కు ఫిలింలు ఇవ్వాలని కోరుతున్నారు. దవాఖాన చుట్టూ ప్రహరీతోపాటు గదులను రెనోవేషన్ చేయాలని కోరుతున్నారు. హాస్పిటల్లో 542 పడకలు ఉన్నప్పటికీ 700 మంది పెషెంట్లు ఇన్పేషెంట్లుగా ఉంటున్నారని, రోజుకు వెయ్యి మందికి పైగా ఔట్ పేషంట్లు వస్తున్నారని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు జరిగిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంగా కరీంనగర్ రికార్డు సాధించిందని, అలాంటి హాస్పిటల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు కోరుతున్నారు.
కేసీఆర్ పాలనలో మూడో విడుత కింద కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. దీనిని జిల్లా కేంద్రానికి సమీపంలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేశారు. తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, లేదా ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు మెడికల్ కాలేజీలో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలంటున్నారు. అలాగే వైద్య కళాశాల హాస్టల్లో వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే బస్సు ఉండడంతో ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా మారిందని, మరో బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్య కళాశాలను వెంటనే పూర్తి చేయాలని, వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
హాస్పిటల్ డెవలప్మెంట్ సోసైటీ (హెచ్‌డీఎస్) సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు దవాఖానలోని సమావేశమందిరంలో నిర్వ హించ నున్నారు. దీనికి మంత్రి హోదాలో పొన్నంప్రభాకర్ మొదటి సారిగా హాజరవుతున్నారు. అలాగే కలెక్టర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ సునీల్‌రావు హాజరు కానున్నారు. అయితే, కరీంనగర్ ఎంపీగా ఉన్నపుడు పొన్నం ప్రభాకర్ దవాఖానపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రత్యేక దృష్టి సారిస్తారని, ప్రత్యేక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు.