కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన (జీజీహెచ్)లో వైద్య పరీక్షలు క్రమంగా నిలిచి పోతున్నాయి. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది లేక సేవలు కొరవడుతున్నాయి. దవాఖాన నిర్వహణకు కనీస నిధులు లేక పోవడంతో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులకు కనీసం ఎక్స్‌రే తీయించాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మిషన్ చెడిపోయి పదిహేను రోజులవుతున్నా బాగు చేయించే దిక్కు లేకుండా పోయింది. ఏడాది కాలంగా మధ్యాహ్నం తర్వాత సీటీ స్కాన్ గదికి తాళం పడుతున్నా.. 2డీ ఇకో గది తెరుచుకోకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు సేవలందించే వైద్యులు, సదుపాయాలు లేక నిత్యం వరంగల్, హైదరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లలేని స్థితిలో రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని వాపోతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్ ప్రభుత్వ జిల్లా దవాఖాన.. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధి నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి మారింది. కానీ, సేవల్లో మాత్రం రోజు రోజుకూ అధ్వానంగా మారుతున్నది. వైద్యం కోసం ఇక్కడికి వస్తున్న రోగులెందరికో నిరాశే మిగులుతున్నది. అత్యవసర సేవల కోసం వచ్చే వారికి కనీస భరోసా కరువవుతున్నది. వైద్యులు లేరనో.. సదుపాయాలు లేవనో.. వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా దవాఖానలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడి వస్తున్న క్షతగాత్రులకు ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇతర దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు.
కనీసం ఇక్కడ ఎక్స్‌రే విభాగం కూడా పని చేయడం లేదు. 15 రోజుల కింద మిషన్ చెడిపోతే ఇప్పటి వరకు బాగు చేయించలేదు. ప్రస్తుతం ఇదే దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రంలోని ఎక్స్‌రేను తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. ప్రతి మంగళ, బుధ, శుక్రవారాల్లో మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ మూడు రోజులు సాధారణ దెబ్బలతో వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ 180 నుంచి 200 మందికి ఇక్కడ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మహిళా కేంద్రంలోనూ సరిపడా సిబ్బంది లేక పని భారం పెరుగుతున్నది. ఎక్స్‌రే మిషన్‌ను బాగు చేసేందుకు నిధులు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆరోగ్య మహిళా కేంద్రంలోని ఎక్సరే మిషన్‌పై ఓవర్ బర్డెన్ పడుతున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇది కూడా చెడిపోయే ప్రమాదం ఉన్నది.
నిధులు లేకనే సేవలు నిర్వీర్యం
ప్రతి రోజూ వెయ్యి నుంచి 1200 మంది రోగులు వచ్చే ఈ దవాఖానలో వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించుకునేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయి. కానీ, వైద్య సేవలే అందనప్పుడు రోగులు ఎలా వస్తారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దవాఖాన నిర్వహణ కోసం కనీస నిధులు లేక పోవడంతోనే పరీక్షలు నిర్వహించే యంత్రాలు క్రమంగా మూలన పడుతున్నట్టు తెలుస్తున్నది. వీటిని రిపేర్ చేయించే స్థితిలో కూడా జిల్లా దవాఖాన అధికారులు లేకపోవడం శోచనీయం. రేడియాలజీ విభాగంలో సరిపడా టెక్నీషియన్లు కూడా లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీటీ స్కాన్, 2డీ ఈకో వంటి విభాగాల్లో సిబ్బందిని నియమించాల్సిన అవసరమున్నది. ప్రైవేట్ దవాఖానల్లో ఇలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే వేలకు వేలు ఖర్చవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో చెల్లించే పరిస్థితి లేని వారే ఇక్కడికి వస్తున్నారు. అలాంటి వారికి ఇక్కడ నిరాశే మిగులుతున్నది.
సీటీ స్కాన్ ఒక్క షిఫ్ట్కే పరిమితం
దవాఖానలో మరో కీలకమైన విభాగంలోనూ రేడియాలజిస్టులు, టెక్నీషియన్లు లేక ఒక్క షిఫ్ట్‌లోనే సేవలు అందిస్తున్నారు. నిజానికి 24/7 సేవలందించేందుకు మూడు షిఫ్టుల్లో సీటీ స్కాన్ విభాగంలో సిబ్బంది పని చేయాలి. కానీ, ఇద్దరు మాత్రమే ఉన్నారు. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకే సీటీ స్కాన్ గది తెరిచి ఉంటున్నది. ఆ తర్వాత తాళమే కనిపిస్తుండడంతో రోగులకు నిరాశే ఎదురవుతున్నది. అత్యవసరంగా సీటీ స్కాన్ సేవల కోసం వచ్చే వారిని ప్రైవేట్‌కు వెళ్లాలని చెప్పలేక వరంగల్, హైదరాబాద్‌కో రెఫర్ చేస్తున్నారు. ఏడాది కాలంగా సీటీ స్కాన్ విభాగంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.
ఒక చోట ఉంటే మరో చోట లేదు
ఆరోగ్య మహిళా కేంద్రానికి సంబంధించిన వైద్య పరీక్షలకు తెలంగాణ రేడియాలజీ హబ్‌లో ఏర్పాటు చేశారు. అందులో విలువైన మిషన్ల నిర్వహణకే వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. కేవలం మహిళల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన మిషన్లను తీసుకెళ్లి ప్రధాన దవాఖానలో పెడుతున్నారు. ప్రతి మంగళ, బుధ, శుక్రవారాల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేసేందుకు తెచ్చిన అల్ట్రాసౌండ్ మిషన్‌ను ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేశారు. ఆరోగ్య మహిళా కేంద్రంలో కేవలం మహిళా వైద్యులు, సిబ్బంది మాత్రమే ఉండి సేవలు అందించాలి. కానీ, అల్ట్రా సౌండ్ పరీక్షల కోసం వచ్చే మహిళలకు ప్రధాన దవాఖానలో అందరితో కలిపి నిర్వహిస్తున్నారు.
సేవలు ఒక చోట.. ఎక్స్‌రేలు మరోచోట
.. ఇతడి పేరు జీవన్ వర్మ. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆయనకు ఎక్స్‌రే తీసేందుకు ఆరోగ్య మహిళా కేంద్రంలోని హబ్‌కు తీసుకెళ్లాల్సి వస్తున్నది. ఇతర పరీక్షలకు దవాఖానకు రావాల్సిందే. అటూ ఇటూ తిప్పడానికే తమకు సమయం సరిపోతోందని జీవన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. దవాఖాన ఒక చోట ఉంటే పరీక్షలకు మరోచోటికి వెళ్లాల్సి వస్తున్నదని వాపోతున్నారు. జీవన్లా రోజుకు పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ఎక్కువ గాయాలతో వస్తున్న వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేయకుండా వరంగల్, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు.