Granite Lorry | తిమ్మాపూర్, జూన్ 13: అధిక లోడుతో గ్రానైట్ రవాణా చేస్తున్న లారీల కారణంగా గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామస్తులు శుక్రవారం రాత్రి లారీలను అడ్డుకుని నిలిపివేశారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జూగుండ్ల గ్రామ శివారులో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి భారీ లోడుతో లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వచ్చునూరు సహా పరిసర గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు.
శుక్రవారం రాత్రి కూడా అధిక లోడుతో లారీలు వెళ్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు వాటిని అడ్డుకుని నిలిపివేశారు. రోడ్లు పాడవుతున్నప్పటికీ క్వారీ యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధిక లోడుతో రవాణా చేసే లారీలపై చర్యలు తీసుకోవడంతో పాటు, దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.