కోరుట్ల, జూన్ 29;రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల కోసం విడుదల చేసిన ప్రగతి నిధులతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కోరుట్ల పట్టణంలో 30 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కోరుట్ల-వేములవాడ రోడ్డు విస్తరణకు మోక్షం లభించింది. 2.75 కోట్లతో పనులు పూర్తి కావడంతో ప్రయాణికుల ఇక్కట్లు తప్పాయి. అంతే కాకుండా గుంతలుగా మారిన కల్లూరు రోడ్డు 75 లక్షలతో మరమ్మతుకు నోచుకున్నది. ఇరువైపులా ఫుట్‌పాత్, డ్రైనేజీ నిర్మించడంతో అందంగా కనిపిస్తున్నది.
2.75కోట్లతో కోరుట్ల- వేములవాడ రోడ్డు..
కోరుట్ల పట్టణంలో కోరుట్ల – వేములవాడ రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుంది. హనుమాన్ ఆలయం నుంచి ఫిల్టర్ బెడ్ వరకు 2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు, ఎక్కడికక్కడ దెబ్బతినడం, పైగా మూలమలుపులు.. ఇరుకుగా ఉండడంతో వాహనదారులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డారు. దాంతో మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అందుకు ఆర్అండ్బీ నిధులు 2.25 కోట్లు, మున్సిపల్ పట్టణ ప్రగతి నిధులు 50 లక్షలు వెచ్చించారు. మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నిబంధనల మేరకు రహదారి ఆనుకొని ఇళ్లు, కట్టడాల తొలగింపు పనులను అధికారులు పర్యవేక్షించారు.
ఇండ్ల యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి తొలగింపునకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. చాలా మంది స్వచ్ఛందంగా కట్టడాల తొలగింపునకు ముందుకు రావడంతో రహదారి విస్తరణకు అడ్డంకులు తొలిగిపోయాయి. నూతన రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అధికారులు, స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. సుమారు 2 కిలో మీటర్ల వరకు నూతనంగా రహదారి నిర్మాణంతోపాటు డ్రైనేజీలను నిర్మించారు. 30 ఏళ్ల సమస్యకు తొలగిపోవడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
75లక్షలతో కల్లూరు రోడ్డు
కల్లూరు రోడ్డు గతుకులతో పూర్తిగా అధ్వానంగా మారగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రత్యేక చొరవతో మరమ్మతు పనులకు మోక్షం కలిగింది. జాతీయ రహదారి కల్లూరు క్రాస్ రోడ్డు నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు తారురోడ్డు నిర్మాణ పనులకు 50 లక్షల పట్టణ ప్రగతి నిధులను అధికారులు కేటాయించారు. రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువ, ఫుట్‌పాత్ నిర్మాణాలకు 25 లక్షలు నిధులు మం జూరయ్యాయి. సుమారు 350 మీటర్ల పొడవునా మూడు వరుసల తారు రోడ్డు, మురుగు కాల్వల కోసం మొత్తం 75 లక్షల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి విస్తరణ పనులు, ఫుట్‌పాత్, మురుగు కాల్వల నిర్మాణంతో నిత్యం రద్దీగా ఉండే కల్లూరు రోడ్డు కొత్త శోభను సంతరించుకున్నది.