ధర్మపురి, నవంబర్ 19: హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పొరుగు రాష్ర్టాల నుంచి సైతం క్షేత్రానికి చేరుకున్న వేలాది మంది భక్తులు గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించారు. నదిలో దీపాలను వదిలి భక్తిప్రవత్తులు చాటుకున్నారు. అనంతరం ప్రధాన దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ సేవల్లో పాల్గొన్నారు. ఆలయంలో అభిషేకాది పూజలు, కుంకుమార్చనలు, నిత్యకల్యాణం జరిపించి, సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. స్వామివారి ఆలయంలో ఉసిరిక చెట్టువద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణులకు దీపదానం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయపండితులు మంత్రోచ్ఛారణలతో విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు. కాగా, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి. నదిలో కార్తీక దీపం వదిలారు. గోదావరి నదిలో స్నానమాచరించారు.
గోదావరికి హారతిలో పాల్గొన్న మంత్రి
ధర్మపురిలో గోదావరికి హారతి కార్యక్రమంలో శుక్రవారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. నదీమాతల్లికి హారతినిచ్చారు.
నేత్రపర్వంగా జ్వాలాతోరణం
వేములవాడ టౌన్, నవంబర్ 19: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ తూర్పు ద్వారం ముందుకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకువచ్చారు. రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భక్తులు ఆలయ ఆవరణలో దీపాలంకరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వేదపండితులు, అర్చకులతోపాటు ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు పైడి శ్రీనివాస్, ఆలయ ఎలక్ట్రికల్ ఏఈ ద్వారక శేఖర్, పర్యవేక్షకులు గుండి మూర్తి, పూజల ఇన్చార్జి రవీందర్రెడ్డి, గౌతమ్, భక్తులు పాల్గొన్నారు.