మానకొండూర్ రూరల్, జూన్ 28: వానకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం మానకొండూర్ మండలం ముంజంపల్లి, నిజాయితీగూడెం గ్రామాల్లో పర్యటించారు. ముంజంపల్లిలో సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డితో కలిసి వీధుల్లో తిరిగారు. పలు ఇండ్లల్లో గోళాలు, డ్రమ్ముల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎక్కువ కాలం నీటిని నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తద్వారా రోగాలను నియంత్రించవచ్చని చెప్పారు. అనంతరం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిజాయితీగూడెం అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సీడీపీవో సబిత ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల్లో పెరుగుదలను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో జువేరియా, డీఆర్డీవో శ్రీలత, సర్పంచ్ బొల్ల మురళి, ఉప సర్పంచులు పిట్టల కుమారస్వామి, కొమురయ్య, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, మండల వైద్యాధికారి డాక్టర్ కృతిజ, ఏసీడీపీవో సరస్వతి, అంగన్వాడీ టీచర్, పోషణ్ అభియాన్ సభ్యులతోపాటు వార్డు సభ్యుడు అనిల్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.