కొత్తపల్లి, నవంబర్ 19 : కరాటేతో ఆత్మైస్థెర్యం పెరుగుతుందని, జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యంతో ఎదుర్కొనే శక్తి వస్తుందని సినీనటుడు సుమన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మార్షల్ ఆర్ట్స్, క్రీడల్లో శిక్షణ పొంది ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ సీఎం కప్-2021 పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని, మార్షల్ ఆర్ట్స్‌తో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయని తెలిపారు.సీఎస్‌కేఐ ఇండియా చీఫ్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో 6వ సారి జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమని, మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి తనవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి ఇ అంజనా ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెకు శాట్‌లో ఉద్యోగావకాశం కల్పించి ప్రోత్సహించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి కరాటే పోటీల టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాబోయే కొద్ది రోజుల్లో ప్రొ కబడ్డీ మాదిరిగా ప్రొ కరాటే పోటీలను నిర్వహించి మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. పోటీల ప్రారంభానికి ముందు ఇండోర్ స్టేడియం ముందు హిరో సుమన్ మొక్కలు నాటారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రజనీశ్ చౌదరి, టోర్నమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, టోర్నమెంట్ చైర్మన్ కత్తెరపాక కొండయ్య, టోర్నమెంట్ టెక్నికల్ అడ్వైజర్ రవీందర్, డీవైఎస్వో కే రాజవీరు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్ మాడుగుల ప్రవీణ్, టీఏఐఎస్కేడీ చైర్మన్ కే వసంత్‌కుమార్, లీగల్ అడ్వైజర్ రాజిరెడ్డి, వెంకటేశం, కోశాధికారి నరేందర్, పాపయ్య, అన్వర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.