మంథని టౌన్/మంథని రూరల్, జూన్ 21: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని, మారుమూల ప్రాంతాలకు సర్కారు వైద్యాన్ని చేరువ చేశామని అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ 70ఏండ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలోనే చేసి చూపిందని, తెలంగాణ దశదిశను మార్చిందని చెప్పారు. మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్పర్సన్ మధూకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌తో కలిసి మంథని మండలం సూరయ్యపల్లి శివారులో 7కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. నాడు రాష్ట్రాన్ని సుధీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రజలకు చేసిందేమీ లేదని, అవి అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. కానీ, రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ సర్కారు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు చేసిందన్నారు. త్వరలోనే మంథనిలో డయాలసిస్ కేంద్రం, ఐసీయూ బెడ్ల ఏర్పాటు చేయడంతో పాటు పురాతన దవాఖానను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో.. టీడీపీ 15 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ సర్కారు ఏడేళ్లలో చేసి చూపించిందని, రాష్ట్రంలో విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయం దశదిశను సమూలంగా మార్చి వేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఖరీదైన వైద్యం సైతం ప్రతి పేద కుటుంబానికి చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌తో కలిసి మంగళవారం మంథనిలో 7కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, ఇతర విభాగాలను హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం ఎస్ఎల్పీ గార్డెన్లో ఏర్పాటు చేసిన మంథని నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.
ముందుగా జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేశారని వివరించారు. గతంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానల్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలుండేవని, కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడేళ్లలో రాష్ట్రమంతటా 100 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మహదేవపూర్లాంటి మారుమూల ప్రాంతంలో సైతం డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మంథనిలోనూ డయాలసిస్ సెంటర్, ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తామని, ఈ పురాతన దవాఖానకు భారీగా నిధులు కేటాయించి ఆధునీకరిస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రామగుండంలో వైద్య కళాశాల ఏర్పాటుకు దశాబ్దాల కాలంగా ప్రతి ఎన్నికల సమయంలో పార్టీలు హామీలు ఇస్తూ వస్తున్నాయని, కానీ నెరవేర్చింది మాత్రం టీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. 600 కోట్లతో 500 పడకల రామగుండం మెడికల్ కళాశాల ఈ యేడాది నుంచే ప్రారంభమైందన్నారు. ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యామని, వచ్చే ఏడాది కరీంనగర్, సిరిసిల్లలో ప్రారంభమవుతాయని చెప్పారు. మంథని నియోజకవర్గంలో సింగరేణి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ నియోజక వర్గ అభివృద్ధి విషయంలో పుట్ట మధూకర్ ట్రబుల్ షూటర్‌గా పనిచేస్తున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామ న్నారు. మంథని నియోజకవర్గానికి మంజూరు కానున్న 3వేల ఇండ్లతో పాటు దళిత బంధు 1500 లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా ఇన్చార్జి మంత్రి కొప్పుల ఈశ్వర్‌కే అప్పగించనున్నట్లు కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ, ఆయూష్ విభాగం కమిషనర్ అలుగు వర్షిణి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ కుమార్‌దీపక్, మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు-మన బడితో పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య
రాష్ట్ర ప్రజల సాదకబాధకాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ శాఖ ప్రాధాన్యం మరింతగా పెరిగింది. పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పల్లె దవాఖానలు బస్తీ దవాఖానలుగా మరింత అభివృద్ధి చెందుతున్నాయి. మన ఊరు-మన బడితో పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య ఈ యేడాదే అందుబాటులోకి వస్తుంది. విద్యా, వైద్యం ఇరిగేషన్ ఇలా ప్రతి ఒక్క శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నూతన విధానాలు దేశమే ఆశ్చర్య పోయే విధంగా ఉన్నాయి.
– మంత్రి కొప్పుల ఈశ్వర్
బీజేపీవి మతతత్వ రాజకీయాలు..
పేదలకు వైద్యం అందించడంలో బీజేపీ, కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అదే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ 28వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నీతి అయోగ్ చెప్పిందని స్పష్టం చేసింది. కానీ, డబుల్ డెక్కర్, డబుల్ ఇంజిన్ అని బీజేపీ నేతలు చెబుతున్నరు. వాళ్లకు అభివృద్ధి ముఖ్యం కాదు, మతకల్లోలాలు సృష్టించడం, రాజకీయ లబ్ధి పొందడమే వారికి ముఖ్యం. కేంద్రంలోని బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ డెక్కర్ కాదు, డబుల్ టక్కర్. డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు.
– మంత్రి హరీశ్‌రావు
ప్రపంచానికే తలమానికం కాళేశ్వరం
ప్రపంచానికే తలమానికంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాం. ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి హరీశ్‌రావు కీలకంగా పని చేశారు. మంథని గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా. ఇక్కడి ప్రజలు ఐకమత్యంగా ఉంటూ సమయం వచ్చినప్పుడల్లా గులాబీ జెండాను ఎగురవేయాలి. 2023 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెండింగ్‌లో ఉన్నది. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.
– పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
టీఆర్ఎస్తోనే అసలైన అభివృద్ధి
మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి కన్నా రాజకీయాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నది. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే కుట్రలు చేస్తున్నది. కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి కనిపిస్తున్నది. 66 గ్రామాలను కలిపే రింగ్ రోడ్డును పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. సర్కారు మంథనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మరికొన్ని నిధులు ఇస్తే 20 నుంచి 25వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. సింగరేణి బ్లాస్టింగ్లతో 6ఎల్, 8ఎల్ కాలువలు ధ్వంసమై సాగునీరు కిందికి రావడం లేదు.
ఒక లిఫ్టు స్కీంను ఏర్పాటు చేస్తే 25వేల ఎకరాల ఆయకట్టుతోపాటు కొత్తగా మరో 15వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో వెంకటాపూర్, ఆరెంద, మల్లారం పంట పొలాల్లోకి నీరు చేరుతున్నది. ఈ సమస్య పరిష్కరించాలి. మంథని ప్రభుత్వ దవాఖానకు కొత్త భవనం, మరో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయాలి. దీంతో ఇక్కడి మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది. మహాముత్తారం మండలం బోర్లగూడెం, పల్మెల మండల కేంద్రానికి కొత్తగా పీహెచ్‌సీలను, మహాముత్తారం దవాఖానకు బాడీ ఫ్రీజర్, బేగంపేట పీహెచ్‌సీకి పూర్తి స్థాయి స్టాఫ్ ఇవ్వాలి.