పెద్దపల్లి, జూన్ 21(నమస్తే తెలంగాణ): విధులను నిర్లక్ష్యం చేయవద్దని, ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథనిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి కొప్పుల, కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. సిజేరియన్ ఆపరేషన్ల తగ్గింపునకు తీసుకున్న చర్యల ఫలితంగా ప్రైవేట్ దవాఖానల్లో 98నుంచి 90శాతం, ప్రభుత్వ దవాఖానల్లో 77 నుంచి 67శాతం సిజేరియన్లు తగ్గాయని, ప్రభుత్వ దవాఖానల్లో 56నుంచి 63శాతం ప్రసవాలు పెరిగాయని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లిలో 100 పడకలు, మంథనిలో 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాల సైతం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
జూలై 2022లో ప్రభుత్వ దవాఖానల్లో 80శాతం ప్రసవాలు జరిగే విధంగా అధికారులు పనిచేయాలని, క్షేత్రస్థాయిలో గర్భిణి కేసులను ఆశ, ఏఎన్ఎంలను సమన్వయం చేసుకొని పోవాలని ఆదేశించారు. గతంతో పోలిస్తే జిల్లాలో సిజేరియన్లు తగ్గినప్పటికీ మరింత తగ్గాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవం చేసే వైద్యులు, ఏఎన్ఎం, ఆశా సిబ్బందికి రూ.3వేల ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి ప్రైవేట్ దవాఖానపై పర్యవేక్షణ ఉండాలని, ప్రతి సిజేరియన్ ఆపరేషన్ ఆడిట్ కట్టుదిట్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. అనవసరపు సీజేరియన్ ఆపరేషన్లు చేసే వారి పేర్లు రాష్ట్ర వైద్య కౌన్సిల్‌కు రిఫర్ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌కు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 700మంది ఆశ కార్యకర్తల పరిధిలో అత్యధికంగా ప్రైవేటు దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నట్లు గుర్తించామని, జిల్లాలో సైతం వారి పనితీరుపై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని డీఎంహెచ్ఓకు సూచించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్సీడీ స్రీనింగ్పై మంత్రి ఆరా తీశారు, 30 ఏండ్ల పైబడిన 75శాతం మందిని పరీక్షించామని అధికారులు తెలిపారు. కాగా, బీపీ, షుగర్ మాత్రలు ప్రజలు సరిగ్గా వాడాలని, నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ సమస్యల వంటి తీవ్ర జబ్బులు వచ్చే ప్రమాదాన్ని వివరిస్తూ ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో 12-14 ఏండ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ అందించాలని మంత్రి సూచించారు. జిల్లాలో గుర్తించిన టీబీ పేషెంట్లందరికీ ప్రభుత్వ సాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను మంత్రి ఆదేశించారు.
జిల్లాలో నూతనంగా మూడు దవాఖానలు అందుబాటులోకి వచ్చినందున అదనపు గైనకాలజిస్టులు, ఇతర వైద్యులు, సిబ్బందిని అందించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. పెద్దపల్లి ఎంసీహెచ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పనులు చివరి దశకు వచ్చాయని, సోమవారం నుంచి పెద్దపల్లి, మంథని ఎంసీహెచ్లలో ఓపీ సేవలు ప్రారంభిస్తామని కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ దవాఖాన, ఎంసీహెచ్‌కు 84మంది పారిశుధ్య సిబ్బంది ఉండాలని, వీటి టెండర్ ప్రక్రియ ఫైనల్ చేసి నియామక ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో టీ డయాగ్నస్టిక్ కేంద్రం ఆరు నెలల్లో పూర్తవుతుందని, అప్పటిదాకా కరీంనగర్ జిల్లాలోని డయాగ్నస్టిక్ కేంద్రం సేవలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యులు డ్యూటీ టైంలో దవాఖానల్లో మాత్రమే ఉండాలని సూచించారు.
జిల్లాలోని దవాఖానలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, వైద్యశాఖ ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డీసీహెచ్ఎస్ మందల వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.