కార్పొరేషన్, జూన్ 21: నగరంలోని టవర్ సర్కిల్ ఏరియాలో స్మార్ట్‌సిటీ పనులను 2019లో టెండర్లలో పేర్కొన్న డిజైన్ల మాదిరిగానే చేపడుతున్నామని, ఈ విషయంలో ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలో అభివృద్ధి పనుల కోసం స్మార్ట్‌సిటీ నిధులతో పాటు సీఎం కేసీఆర్ రూ. 900 కోట్లకు పైగా మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో ఆర్అండ్బీ ప్రధాన రోడ్లకు రూ. 110 కోట్లు, మానేరు రివర్ ఫ్రంట్‌కు రూ. 400 కోట్లకు పైగా, కేబుల్ బ్రిడ్జికి రూ. 186 కోట్లు, నగరపాలక సంస్థకు మూడు విడుతల్లో రూ. 314 కోట్లు ఇలా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నిధులతో చేపట్టిన పనుల్లో సగం పూర్తి కాగా, మిగతావి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపడుతున్నట్లు చెప్పారు. తమ పాలకవర్గం వచ్చిన తర్వాత నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. వచ్చే జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. టవర్ ప్రాంతంలో అన్ని ఇండ్ల వెల్వెక్షన్ ఒకే విధంగా, ఒకే రంగులో ఉండాలని టెండర్లలో పేర్కొన్నారని తెలిపారు. ఇందుకోసం ఆయా ఇండ్లకు ప్రస్తుతం ఉన్న వెల్వెక్షన్ కూల్చి తిరిగి ఒకే తీరులో నిర్మించి రంగులు వేయాల్సి ఉంటుందన్నారు. ఇండ్ల యజమానులు అంగీకరిస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామన్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్‌కు గతంలో వేసిన అంచనాకు మించి రూ. 5 కోట్లకుపైగా వ్యయం అవుతున్నట్లు తెలిపారు. దీంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అలాగే, సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ కూడా పనుల్లో జాప్యం చేయడంతో 2020 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు నోటీసులు ఇచ్చామని, ఇటీవల ఫైనల్ నోటీసు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పనుల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం సరికాదన్నారు. టెండర్లల్లో పేర్కొన్న విధంగానే పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలు చూస్తాయని తెలిపారు. కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, జంగిలి ఐలేందర్‌యాదవ్, తోట రాములు, వాల రమణారావు, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, నేతికుంట యాదయ్య, గంట కళ్యాణి, గందె మాధవి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.