కోర్టు చౌరస్తా, జూన్ 21 : పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో ముందుకు సాగాలని సీపీ సత్యనారాయణ సూచించారు. కరీంనగర్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సీపీ అధ్యక్షతన కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి సంయుక్త ఆధ్యర్వంలో మంగళవారం పోలీసులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, పోలీసులు, న్యాయవాదులు సమాజానికి రెండు కండ్ల లాంటివారని, ఒకరి వృత్తిని ఇంకొకరు గౌరవించుకుంటూ సమాజ రక్షణకు పోలీసులు, న్యాయాన్ని బతికించడానికి న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. న్యాయాన్ని బతికించేందుకు రోజూ ఇరు వర్గాలు కృషి చేస్తాయని, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా, సిరిసిల్లకు చెందిన ఓ సీఐ, కరీంనగర్‌కు చెందిన ఓ న్యాయవాది విషయంలో పరుషంగా వ్యవహరించిన తీరుపై బార్ అసోసియేషన్ తరఫున ఇన్చార్జి డీఐజీ, సీపీ సత్యనారాయణకు విన్నవించగా సీఐతో మాట్లాడినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా ఉండడానికి పోలీసులు, న్యాయవాదులతో సీపీ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ తరహా సమావేశం జరగడం రాష్ట్రంలోనే మొదటిసారని, ఈ విషయంలో చొరవ చూపిన సీపీకి బార్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వోఎస్డీ మోహన్, ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లింగంపల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, సెక్రటరీ శ్రీధర్ రావు, పెరుక శ్రీనివాస్, బెజ్జంకి శ్రీకాంత్, న్యాయవాదులు పాల్గొన్నారు.