రాంనగర్, నవంబర్ 18: మద్యం దుకాణాలకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ఊహించినట్లుగానే చివరి రోజు దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. దరఖాస్తు చేసిన వారిలో ఈసారి మహిళలు కూడా అధికంగా ఉండడం విశేషం. కరీంనగర్ జిల్లాలోని 94 మద్యం దుకాణాలకు మొదటి ఎనిమిది రోజులు 509 దరఖాస్తులు రాగా, చివరి రోజు సాయంత్రం వరకే 780 వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని, క్యూ లైన్లలో వేచి ఉన్న ప్రతి ఒక్కరి నుంచి అర్జీ స్వీకరిస్తామని తెలిపారు. గతేడాది 87 మద్యం దుకాణాలకు 1300 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి వాటి సంఖ్య మరింత పెరుగనున్నట్లు తెలుస్తున్నది. కేవలం దరఖాస్తుల ద్వారానే సుమారు 25 -30 కోట్ల ఆదాయం ఖజానాకు సమకూరే అవకాశం ఉంది. ఈసారి మద్యం దుకాణాలకు కూడా రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఎస్సీలకు, గౌడ సామాజిక వర్గానికి దుకాణాలు కేటాయించినా దరఖాస్తు చేసే వారి సంఖ్య పెరుగడం విశేషం.
రాత్రి 10 గంటల వరకు..
రాత్రి 10 గంటల వరకు జిల్లాలోని 94 మద్యం దుకాణాలకు గానూ 1,644 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి వెల్లడించారు. వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 20న కలెక్టరేట్ ఆడిటోరియంలో దరఖాస్తుదారులు తాము తీసుకున్న ఎంట్రీ పాసులతో డ్రా తీసే సమయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. కాగా, రాత్రి 7 గంటల వరకు వచ్చిన దరఖాస్తుల్లో కరీంనగర్ అర్బన్ పరిధిలో 338, రూరల్ పరిధిలో 350, జమ్మికుంట పరిధిలో 212, హుజూరాబాద్ పరిధిలో 289, తిమ్మాపూర్ పరిధిలో 278 ఉన్నాయని తెలిపారు.