చిగురుమామిడి, జూన్ 21: గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ స్పష్టం చేశారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున పూర్తి చేసేందుకు భూనిర్వాసితులు సహకరించాలని కోరారు. నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంగళవారం హుస్నాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లందించాలన్న కల త్వరలోనే నెరవేరుతుందన్నారు.
ప్రతిపక్షాలు కుట్రపూరితమైన చర్యలతో హుస్నాబాద్ రైతులకు నీళ్లు అందించకుండా ప్రాజెక్టు పనులు చేయకుండా అడుగడుగునా అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు. భూ నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు పబ్బం గడుపుకోవడం కోసం రైతులు, భూ నిర్వాసితులను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 97.82 శాతం భూ నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం అందించామని, కేవలం 2.18 శాతం మందికి మాత్రమే చెల్లించాల్సి ఉందని వివరించారు. ఈ ప్రాంతానికి నీళ్లు వస్తే తమకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల గారడి మాటలు నమ్మి భూ నిర్వాసితులు నష్టపోవద్దని సూచించారు.