కరీంనగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో పదివేల మైలు రాయిని దాటింది. వేగంగా గ్రౌండింగ్ జరుగుతుండగా, అంతే వేగంగా దళిత లోకం ఆర్థిక ప్రగతివైపు అడుగులు వేస్తున్నది. ఇప్పటికే పది వేల యూనిట్లు పంపిణీ చేయగా, లబ్ధిదారులకు శాశ్వత ఉపాధి దొరికింది.
దళితుల బతుకుల్లో చీకట్లు పారదోలేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెచ్చారు. అందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పెలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. గతేడాది ఆగస్టు 16న శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకు రుణం లేకుండా, ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించే అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో 13,556 మంది అర్హులను గుర్తించారు. వీరికి శాశ్వతంగా ఆదాయమిచ్చే, నచ్చిన, అనుభవమున్న రంగానికి సంబంధించిన యూనిట్లను ఎంచుకునే విధంగా ప్రాధాన్యత ఇచ్చారు.
ఎంచుకున్న యూనిట్లో అనుభవం లేకుంటే శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పటికే 10,006 మంది లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. ఇచ్చిన యూనిట్‌ను సద్వినియోగం చేసుకుని దళితబిడ్డలు ఆర్థికంగా స్థిర పడుతుండగా, మిగతా లబ్ధిదారులకు ఈ నెలలోనే యూనిట్లు ఇచ్చేందుకు అధికారులు శరవేగంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోగా, దళితులు ఆర్థిక ప్రగతివైపు అడుగులు వేస్తున్నారు. దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సీఎం కన్న కలలు హుజూరాబాద్ నియోజకవర్గంలో సాకారమవుతున్నాయని చెబుతున్నారు. 10 వేల యూనిట్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు నివేదిక అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.
ఈ నెలలోనే మిగతా యూనిట్లు
దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,559 యూనిట్లకు గాను 10,006 యూనిట్లను గ్రౌండింగ్ చేశాం. ఇంకా మిగిలిన యూనిట్లను ఈ నెలలో గ్రౌండింగ్ చేస్తాం. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించాం. వీటిలో ఎక్కువగా గ్రూప్ యూనిట్లను రూపొందించాం. ఫర్టిలైజర్స్, మెడికల్ దుకాణాలు, ట్రాన్స్పోర్ట్ సెక్టార్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షణ, కలెక్టర్ ఆధ్వర్యంలో యూనిట్ల పంపిణీ వేగంగా జరుగుతున్నది. లబ్ధిదారులు యూనిట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు.
– డీ సురేశ్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ (కరీంనగర్)