తెలంగాణచౌక్ (కరీంనగర్)/ పెద్దపలిటౌన్/ జ్యోతినగర్/ కలెక్టరేట్ (సిరిసిల్ల)/ గంభీరావుపేట జూన్ 18: అగ్నిపథ్‌పై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. రెండో రోజు శనివారం వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్వంలో ఆందోళనలు కొనసాగాయి. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రాలు, గంభీరావుపేట, పెద్దపల్లి జిల్లాకేంద్రంతోపాటు ఎన్టీపీసీలో నాయకులు, విద్యార్థులు ధర్నాలకు దిగారు. ప్ల్లకార్డులతో నిరసన ర్యాలీలు తీశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. దేశ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిన దుర్మార్గపు పథకాన్ని రద్దుచేసే దాకా పోరు ఆపబోమని తేల్చిచెప్పారు.
సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ శనివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అస్తవ్యస్థమైన ఈ స్కీంను రద్దుచేయాల్సిందేనని వివిధ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. మోదీ ప్రభుత్వం వెనక్కితగ్గేదాకా పోరాటం చేస్తామని తేల్చిచెప్పాయి. కరీంనగర్‌లోని గంజ్ ఏరియాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ నేతృత్వంలో నిరసన తెలిపారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రధానీ మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకే కేంద్రం అగ్నిపథ్ స్కీంను తెచ్చిందని ఆరోపించారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన ప్రధాని మోదీ ఉన్న ఉద్యోగాలను తీసేస్తూ మోసం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి మండిపడ్డారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఎం నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధానీ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు ఎరవెల్లి ముత్యం రావు మాట్లాడుతూ బీజేపీ సర్కారు దేశభక్తి ముసుగులో దమనకాండకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. దేశరక్షణను కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో యత్నిస్తున్నదని మండిపడ్డారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సీఐటీయూ నాయకులు ప్లకార్డులతో ర్యాలీ తీశారు. అగ్నిపథ్‌తో సైన్యంలో చేరాలనుకొనే యువతకు నిరాశే ఎదురైందని యూనియన్ నాయకులు విమర్శించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పింఛన్ డబ్బులకు కక్కుర్తిపడే కేంద్రం ఈ దుర్మార్గపు పథకాన్ని తెచ్చిందని దుయ్యబట్టారు. గంభీరావుపేటలో బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు.