కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 18 : నగరంలో నిరంతర పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపుదిద్దుకుంటున్నది. మెట్రో పాలిటన్ సిటీల తరహాలో కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర నిఘా ఉండనున్నది. స్మార్ట్‌సిటీ కింద రూ.94.99 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలో కమాండ్ కంట్రోల్ సిస్టంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు పనులను మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ప్రారంభించారు. ప్రస్తుతం తాత్కాలికంగా కార్పొరేషన్ కార్యాలయంలోనే కంట్రోల్ సిస్టం ద్వారా పనులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 24న ఈ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీని ద్వారా శాంతిభద్రతల నిరంతర పర్యవేక్షణతో పాటు, నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వారికి ఆధునిక టెక్నాలజీని వినియోగించి నేరుగా జరిమానాలు విధించనున్నారు. నగరపాలక సంస్థ పారిశుధ్య వాహనాల పనితీరును పరిశీలించేందుకు జీపీఎస్ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.
కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షణ
స్మార్ట్‌సిటీ కింద నగరంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణతోపాటు నగరపాలక సంస్థకు చెందిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం, పబ్లిక్ అనౌన్స్మెంట్, పర్యావరణ స్థితి, సమాచారం అందించే బోర్డులు కంట్రోల్ సెంటర్ నుంచి చేపడుతున్నారు. ఈ కేంద్రం నుంచే వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. 94.99 కోట్లతో చేపడుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు గతంలో కరీంనగర్ బల్దియా టెండర్లు పిలువగా మాట్రిక్స్, అల్వీ కంపెనీలు పనులు దక్కించుకున్నాయి.
335 సీసీ కెమెరాలు
నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 335 ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలను కంట్రోల్ సెంటర్లోని భారీ తెర (వీడియో వాల్) మీది నుంచి అనునిత్యం పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 24 చౌరస్తాల్లో సిగ్నల్స్ వ్యవస్థ రూపుదిద్దుకోనున్నది. ఇందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు సిగ్నిల్స్ సమయం పెంచడం, తక్కువగా ఉన్నప్పుడు తగ్గించడం పూర్తిగా కంట్రోల్ సెంటర్ నుంచి ఆటోమేటిక్‌గా జరిగేలా చూస్తారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళ్లే వాహనాలపైనా జరిమానా విధించేందుకు ప్రత్యేకంగా ఆయా సిగ్నిల్స్ వద్ద రెడ్‌లైన్ అతిక్రమణ, నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, వాహన డిడక్షన్ల కోసం కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టం
నగరంలో అత్యవసర పరిస్థితులు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అందించేందుకు ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానాన్ని తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఆయా ప్రాంతాల్లో మైక్‌లు ఏర్పాటు చేయడంతో ముఖ్యమైన సమాచారం, ప్రముఖుల పర్యటనలు ఉన్నప్పుడు ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బస్టాండ్, తెలంగాణచౌక్, కమాన్, టవర్‌సర్కిల్, కలెక్టరేట్, తదితర 40 ప్రాంతాల్లో ఈ సిస్టమ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మైక్‌లన్నీ కూడా కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. నగరంలోని 10 ప్రాంతాల్లో ప్రజలకు సమాచారం అందించేందుకు భారీ డిస్ప్లే తెరలను ఏర్పాటు చేయనున్నారు. 3 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల పొడవుతో ఉన్న డిస్ప్లేను నగరంలో ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేస్తారు.
దీనిలో నగరపాలక సంస్థ, ప్రభుత్వానికి సమాచారం ప్రజలకు అందించడంతో పాటు, ఇతర ప్రైవేటు సంస్థలకు సంబంధించిన సమాచారం అందించేందుకు వీలుంటుంది. వీటిని బస్టాండ్, టవర్‌సర్కిల్, తెలంగాణచౌక్, కమాన్, మంచిర్యాల చౌరస్తా, ప్రభుత్వ దవాఖాన, తెలంగాణ తల్లి చౌరస్తా, బైపాస్, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రైవేటు సంస్థలకు చెందిన అడ్వర్టైజ్మెంట్లు ప్రచురితం చేయడంతో నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో పర్యావరణ పరిస్థితిని తెలిపేందుకు వీలుగా 10 ప్రాంతాల్లో వాతావరణ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలు, ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ముఖ్యంగా నగరంలో పొల్యూషన్ పరిస్థితి, వర్షపాతం నమోదు, ఉష్ణోగ్రతలను ప్రజలకు తెలియజేసేలా ఏర్పాటు చేస్తారు. నగరంలో 150 వరకు వైఫై హాట్‌స్పాట్స్ పోల్స్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఆయా టెలికాం సంస్థల నిబంధనల మేరకు ఈ వైఫైలను ప్రజలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
పారిశుధ్య వాహనాలకు జీపీఎస్
నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, వాహనాల పనితీరును కూడా ఈ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షించనున్నారు. ఇందుకు పారిశుధ్య వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ వ్యవస్థను అమర్చనున్నారు. అలాగే, ఒక్కో వాహనానికి రూట్‌మ్యాప్ నిర్ణయించి ఆ మేరకు ఆ వాహనం నిర్దేశించిన మార్గాల్లో వెళ్తుందో.. లేదో తెలుసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. పారిశుధ్య విభాగంలోని జవాన్లు, ఇన్స్పెక్టర్లకు కూడా హ్యాండ్ రీడర్లను అందించడం ద్వారా ఆయా సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేస్తున్నారో లేదో తెలుసుకునేందుకు క్యూఆర్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు.