కరీంనగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి పండుగ ముగిసింది. పక్షం రోజులపాటు విజయవంతంగా సాగింది. పల్లె మురిసేలా.. పట్టణం మెరిసేలా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 3వ తేదీన కార్యక్రమాలు అట్టహాసంగా మొదలై, చివరి రోజు శనివారం వరకు జోరుగా కొనసాగాయి. అధికారులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, పచ్చదనం, విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంకంటే ఈసారి భిన్నంగా నిర్వహించారు. ఒక్కో పనిని ఒక్కో శాఖకు అప్పగించి, గడువులోగా పూర్తయ్యేలా చూశారు. కాగా, చివరి రోజు ముగింపు సమావేశాలు నిర్వహించి, పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు.
‘ప్రగతి’ పండుగ ముగిసింది. ఐదో విడుత పల్లెప్రగతి, నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి బాట పట్టాయి. పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాలు లక్ష్యాన్ని సాధించాయి. ప్రారంభమైన రోజు నుంచి 15 రోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించారు. ముఖ్యంగా మురుగు కాలువలు, వీధులు శుభ్రమయ్యాయి. శిథిల భవనాలు, ముళ్ల పొదలు తొలగిపోయాయి. మంచినీటి పైప్లైన్ల లీకేజీ సమస్యలు పరిష్కారమయ్యాయి. పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఖాళీ ప్రదేశాలు, చెరువు గట్లపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిరుపయోగంగా ఉన్న బావులు, బోరుబావులను పూడ్చివేశారు. మరుగుదొడ్ల వినియోగం, తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కన ట్రీగార్డులను సరి చేసి, మొక్కలకు రక్షణ కల్పించారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, అట్టహాసంగా ప్రారంభించారు. కాగా, చివరి రోజు ముగింపు సమావేశాలు నిర్వహించి పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. మానకొండూర్ మండలం గంగిపెల్లిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. హుజూరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.
రామడుగు మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలోని 47,48 వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రజలకు పారిశుధ్యం, ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిరిపూర్‌లో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు, పల్లెప్రకృతి వనం, వననర్సరీలను పరిశీలించారు. గ్రామంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను నిర్మించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రామగుండంలోని 13వ డివిజన్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, తదితరులు పర్యటించారు.
పరిశుభ్రంగా రాష్ట్రం
నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రం పరిశుభ్రంగా మారింది. పెండింగ్‌లో ఉన్న వేల సమస్యలు పరిష్కారమయ్యాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశంలో ఏ అవార్డు ప్రకటించినా అవి తెలంగాణకు రావడమే ఇందుకు నిదర్శనం. గ్రామీణుల్లో క్రీడా నైపుణ్యం వెలికితీసేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం.