కార్పొరేషన్, జూన్ 18 : ఆర్మీలో ప్రస్తుతం సాగుతున్న తీరులోనే నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక నియామకాలు వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతను రెచ్చగొట్టొద్దని, సున్నితమైన అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హితవుపలికారు. శనివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కార్ఖానగడ్డలో దళితబంధు ద్వారా మంజూరైన కిరాణం షాపు, ఆటోను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎస్సారార్ కళాశాల సమీపంలో 12.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అమృతవర్షిణి (కళాభారతి) నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా కొత్తపల్లి మండలం చింతకుంటలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. కళాకారుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో అమృతవర్షిణి నిర్మిస్తున్నట్లు చెప్పారు. లోపల వెయ్యి మందికిపైగా వీక్షకులు చూసేలా భవన నిర్మాణం ఉంటుందన్నారు.
టీఆర్ఎస్ పాలనలో పట్టణాలు ఆధునీకరణ చెందుతున్నాయన్నారు. ఇటీవలి కాలంలో కేంద్రం తీసుకుంటున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయని మండిపడ్డారు. నూతన రైతు చట్టాలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. ఇప్పుడు అగ్నిపథ్ పేరిట మరో వివాదానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. ఈ హింసాత్మక ఘటనల్లో టీఆర్ఎస్ హస్తం ఉందని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని, ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. యువకులు కోరే డిమాండ్‌ను పరిష్కరించకుండా రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదన్నారు. సాయుధ దళాల్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండాలంటే పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు.
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం దళితబంధును తీసుకువచ్చిందని గుర్తు చేశారు. దళితబిడ్డలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థకంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో నగర మేయర్ సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్లు మెండి శ్రీలత చంద్రశేఖర్, కుర్ర తిరుపతి, బండ సుమ, బండారి వేణు, దిండిగాల మహేశ్, చాడగొండ బుచ్చిరెడ్డి.. చింతకుంటలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌గౌడ్, సర్పంచ్ మొగిలి మంజుల సమ్మయ్య, ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్, పట్టెం శారద లక్ష్మీనారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రేవంత్‌రెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.