కలెక్టరేట్, జూన్ 18 : తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, మాజీ ఐఏఎస్ అధికారి సీ పార్థసారథి పేర్కొన్నారు. యువత ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి కొలువు సాధించాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏకాగ్రతే విజయానికి నాంది అని, ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి ఉద్యోగ సాధనలో తొలిమెట్టు అధిగమించాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్ 1, ఎస్ఐ, ఇతర పోటీ పరీక్షలపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధానంపై అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో కీలకమైందని, యువత తమ కలను సాకారం చేసుకునేందుకు ఇదే సువర్ణావకాశమని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో ఇప్పటికే 50 శాతం విజయం సాధించ గలిగారని, ఇంకొంచెం కష్టపడితే జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడం సులువేనన్నారు. ప్రభుత్వ అధికారిగా హోదాను అనుభవిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఆత్మ సంతృప్తి పొందే అవకాశం, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లభిస్తుందన్నారు. ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రణాళికా బద్ధంగా చదవాలని పిలుపునిచ్చారు. సమయ పాలన పాటిస్తూ సిలబస్‌కు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు.
గతంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకుంటూ అవగతం చేసుకోవాలన్నారు. పరీక్షలో ప్రతి ప్రశ్న, ప్రతి మారు కీలకమేనని, ఏకాగ్రత, స్థిరత్వంతో విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. తాను కూడా గ్రామీణ మధ్య తరగతి కుటుంబం నుంచే ఈ స్థాయికి ఎదిగానని ఉదహరించారు. ఆత్మన్యూనతకు గురి కావద్దని, ఉద్యోగం సాధిస్తాననే ధీమాతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చేతిలో లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కంటే, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడంపైనే దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
అనంతరం అభ్యర్థుల మధ్య తిరుగుతూ, వారు వెలిబుచ్చే సందేహాలు తీర్చుతూ, పలు కీలక సూచనలు చేశారు. ఉద్యోగ సాధనకు అనుసరించాల్సిన పద్ధతులు, సన్నద్ధత తీరు గురించి అనేక అంశాలను మేళవిస్తూ ఆకట్టుకునే రీతిలో విడమరచి చెప్పి, అభ్యర్థుల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంపొందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, వారధి సొసైటీ బాధ్యుడు ఆంజనేయులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు నతానియెల్, గంగారాం, రాజ మనోహర్, మధుసూదన్, స్టడీ సర్కిళ్ల డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
వారధి యాప్‌ను వినియోగించుకోవాలి..
జిల్లాలో వారధి సొసైటీ, బీసీ, ఎస్సీ, ఎస్ట్టీ, మైనార్టీ స్టడీ సరిల్స్ ద్వారా వివిధ వర్గాల నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. నిరుద్యోగ యువత కోసం రూపొందించిన వారధి యాప్‌ను వినియోగించుకోవాలి. సమయం వృథా చేయకుండా ఒక టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ కావాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి.
– కలెక్టర్ ఆర్వీ కర్ణన్
విజయం మీ చేతుల్లోనే ఉంది..
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సమయం వృథా చేసుకోవద్దు. పక్కా ప్రణాళికతో కష్టపడి చదవాలి. అప్పుడే మీరుకున్నది సాధిస్తారు. మీ విజయం మీ చేతుల్లోనే ఉన్నది. అనవసర అపోహలు, పుకార్లు నమ్మి టైం వేస్ట్ చేసుకోవద్దు.
– సీపీ సత్యనారాయణ