మానకొండూర్ రూరల్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. మండలంలోని గంగిపల్లిలో శనివారం సర్పంచ్ మాశం శాలిని-సాగర్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. గ్రామ పంచాయతీ నిధులు రూ. 7 లక్షలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగిపల్లిలో 90 శాతం సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అన్ని కుల సంఘాల భవనాలు సైతం కట్టించామని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. దళిత బంధు పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ‘పల్లె ప్రగతి’లో సేవలందించిన గ్రామ పంచాయతీ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి చెక్కులతో పాటు చీరెలను అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, ఎంపీవో రాజేశ్వర్ రావు, ఉప సర్పంచ్ తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఎంపీటీసీ చలిగంటి సంపత్, మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, కరీంనగర్ కార్పొరేటర్ వాల రమణారావు, పీఏసీఎస్ డైరెక్టర్ వాల అంజుత్ రావు, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు నూతి శ్రీనివాస్, గ్రామాధ్యక్షుడు ఇడుమాల సంపత్, నాయకులు రెడ్డి సంపత్ రెడ్డి, గంగుల రవి, దొమ్మాట పరశురాములు గౌడ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.