కలెక్టరేట్, నవంబర్ 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వేములవాడ ఆలయ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, బద్దిపోచమ్మ దేవస్థానం అభివృద్ధి, గుడి చెరువు విస్తరణ, భక్తులకు వసతి కోసం చేపట్టాల్సిన చర్యలపై రూపొందించిన మాస్టర్ ప్లాన్ చార్ట్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో నీటి వసతి, పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రోడ్లు ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేసేలా చూడాలన్నారు. మున్సిపల్లో ఉన్న మొత్తం 106 మంది పారిశుద్ధ్య సిబ్బందికి వారం రోజుల్లోగా బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని, వారి హాజరు వివరాలను ప్రతిరోజూ ఉదయం 8 గంటల వరకు సమర్పించాలని ఆదేశించారు. వేములవాడ పట్టణ పరిధిలో ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ధార్మిక క్షేత్రం అభివృద్ధికి తగిన చర్యలు చేపడున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, వేములవాడ ఆర్డీవో వి.లీల, మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, ఈవో కృష్ణప్రసాద్, తహసీల్దార్లు మునీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి..
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్యాధికారితో కలిసి తనిఖీ చేశారు. దవాఖానలో రోగులకు అందుతున్న సేవలు, నిత్యం వచ్చే రోగుల సంఖ్య, సాధారణ ప్రసవాల వివరాలు, సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ రిజిస్టర్‌తో పాటు సౌకర్యాల గురించి ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంజీవరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని మందుల గది, వ్యాక్సినేషన్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. దవాఖాన పరిధిలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు, కొవిడ్ వ్యాక్సినేషన్, సాధారణ ప్రసవాలు, దవాఖాన సమస్యలపై కలెక్టర్‌కు వైద్య సిబ్బంది విన్నవించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోగులకు అందించే సేవలతోనే ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై మరింత నమ్మకం ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కాన్పుల్లో ముందు వరుసలో నిలుపుతున్న డాక్టర్ సంజీవరెడ్డితో పాటు సిబ్బందిని అభినందించారు. ఇక్కడ సిబ్బంది ఉన్నారు.