మానకొండూర్ రూరల్, జూన్ 18: అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలో అసువులు బాసిన సైనిక ఉద్యోగార్థి రాకేశ్ మృతికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ ఘటన తెలంగాణ ప్రభుత్వ నిఘా వైఫల్యమేనని బాధ్యతారహితంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. శనివారం ఆయన మానకొండూర్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం అనాలోచితంగా తెచ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా యువత నిరసనలు చేపట్టిందని, ప్రధానీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీలోనూ ఆందోళనలు కొనసాగాయన్నారు. అయితే సికింద్రాబాద్ ఘటన టీఆర్ఎస్ పనేనని మాట్లాడిన ఆ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
మరణించిన యువకుడికి టీఆర్ఎస్తో ఎలాంటి సంబంధంలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సైన్యంలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్న యువత ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందన్నారు. యువకులు స్వచ్ఛందంగా చేసే ఆందోళనలకు బీజేపీ నేతలు మతం, కులాన్ని ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. సికింద్రాబాద్ ఘటన రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యమంటున్న బీజేపీ నాయకులు, వారి పార్టీ పాలిత రాష్ర్టాల్లో చెలరేగిన అల్లర్లకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇవి పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిందించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇప్పటికైనా కేంద్రం అస్తవ్యస్థంగా ఉన్న అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాతపద్ధతిలోనే సైనిక నియామకాలను చేపట్టాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, నాయకులు పాషా, దండు రాములు, దండబోయిన శేఖర్, గుర్రం కిరణ్ గౌడ్, వెంకటస్వామి, పిండి సందీప్, కొట్టె రఘు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.