కార్పొరేషన్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది. పదిహేను రోజుల పాటు నగరంలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున పారిశుధ్య పనులు, ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన సమస్యలను గుర్తించి పరిష్కరించారు. శనివారం ఆయా డివిజన్లలో డివిజన్ కమిటీల సభ్యులతో మాట్లాడారు. గుర్తించిన సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పట్టణ ప్రగతిలో చివరి రోజు పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించారు. డివిజన్లలో చేపట్టే అభివృద్ధి పనులపై తీర్మానాలు చేసి నగరపాలక సంస్థకు పంపించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో అన్ని డివిజన్లలో ఖాళీ స్థలాలన్ని పరిశుభ్రంగా మారాయి.
ముకరంపుర, జూన్ 18: 18వ డివిజన్ క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. డివిజన్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై నివేదికను రూపొందించారు. అభివృద్ధి పనుల విషయమై చర్చించారు. డివిజన్ ఇన్చార్జి వెంకటరమణ, ఏఎన్ఎం విజయ, ఆర్పీలు విజయ, రోజా, జవాన్ మల్లేశం, డివిజన్ కమిటీ సభ్యులు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యానగర్, జూన్ 18: పట్టణంలోని 19వ డివిజన్లో గల శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ ఆవరణలో కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి హైమద్ అలీ, ప్రత్యేకాధికారి శివరామకృష్ణ, కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూన్ 18: పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించారు. చివరి రోజు పదో వార్డులో చేపట్టిన పారిశుధ్య పనులను చైర్మన్ రుద్ర రాజు పరిశీలించారు. వార్డులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం చేపట్టాలని మండల ప్రత్యేకాధికారి మధుసూదన్ పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామంలో సర్పంచ్ గాజుల వెంకటమ్మ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టే పనులపై సమీక్షించారు. వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఇంటితో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, వార్డు సభ్యుడు కల్లెపల్లి అశోక్, పంచాయతీ కార్యదర్శి ఇదైతుల్లా తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్‌లో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని శానిటేషన్ పనులు, డంప్ యార్డు వద్ద గుంతల పూడ్చివేత, గ్రామంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. గ్రామంలోని వాటర్ ప్లాంట్ నిర్వహణకు వేలం నిర్వహించారు. ఉపసర్పంచ్ చిట్కూరి శేఖర్, వార్డు సభ్యులు ప్రవీణ్‌రెడ్డి, కూర సంధ్య, ఆకుల సుజాత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.