పెద్దపల్లి, జూలై 17(నమస్తే తెలంగాణ)/ ముకరంపుర/ జ్యోతినగర్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో పోలీసుశాఖ హై అలర్ట్ ప్రకటించింది. రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేసింది. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని స్టేషన్లలో తనిఖీలు చేపట్టి, అక్కడే మకాం వేసింది. భారీగా బలగాలను మోహరించి తమ ఆధీనంలోకి తీసుకొని ముందస్తు చర్యలు తీసుకున్నది. ఫలితంగా రైళ్ల రాకపోకలు యధాతథంసాగాయి.
అగ్నిపథ్ విషయమై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకున్న నిరసననల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లిలో రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి, రామగుండం, కొలనూరు, పొత్కపల్లి, ఓదెల, రాఘవాపూర్ రైల్వే స్టేషన్లను పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, రామగుండం ఏసీపీ గిరిప్రసాద్ తనిఖీ చేశారు. జిల్లా మీదుగా దేశ రాజధాని ఢిల్లీకి రైల్వే లైన్ ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్తలు చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి రైల్వే స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రామగుండం రైల్వే స్టేషన్లో రామగుండం ఆర్పీఎఫ్ సీఐ బుర్ర సురేశ్‌గౌడ్, రామగుండం సీఐ కణతాల లక్ష్మీనారాయణ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
1 కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లెలోని రైల్వే స్టేషన్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ మీదుగా వివిధ ప్రాంతాలకు రైళ్లు నిర్ణీత సమయానికే రాకపోకలు సాగించాయి. కరీంనగర్ మీదుగా పెద్దపల్లి నుంచి కాజీపేటకు, పెద్దపల్లి నుంచి కరీంనగర్ మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లు యథావిధిగా నడిచాయి. దాదర్-కాజీపేట సమ్మర్ స్పెషల్ రైలు(07916) కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్లింది. పెద్దపల్లి-కాచిగూడ రైలు(07794) కరీంనగర్ మార్గంలో నిర్ణీత సమయంలోనే వెళ్లింది. గూడ్స్ రైళ్లు ఎప్పటిలాగే రాకపోకలు సాగించాయి.
ధనాపూర్, పద్మావతి రైళ్లు రద్దు
సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి జంక్షన్ మీదుగా ధనాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రద్దయ్యింది. పెద్దపల్లికి మధ్యాహ్నం 12.30కి రావాల్సిన ఆ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. తిరుపతి వెళ్లే పద్మావతి రైలును రద్దు చేశారు. దీంతో రైల్వే ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. మిగతా రైళ్లన్నీ యధాతథంగా నడుస్తున్నాయి.