జమ్మికుంట రూరల్ జూన్ 17: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. వారికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజాసంక్షేమానికి ఎం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, ఆసరా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని కొనియాడారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి జమ్మికుంట, మోత్కూలగూడెంలో పర్యటించారు.
జమ్మికుంటలో ధర్మారం కేశవపూర్, నాయిని చెరువు కట్టపై పట్టణ ప్రగతిలో భాగంగా 99 లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు, డంప్‌యార్డులు, 2.5కోట్లతో చేపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, మోత్కూలగూడెంలో 70లక్షలతో నిర్మించిన అధునాతన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. జమ్మికుంటలో బీఐసీటీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల వినోద్ మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూనే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించారని, కాళేశ్వరం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు నీరందిస్తున్నారని పేర్కొన్నారు.
మూడేండ్లు కరువొచ్చినా ఇబ్బందేంలేదని.. మండుటెండల్లోనూ చెరువులు, కుం టలు మత్తళ్లు దూకుతుండడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇటీవల బీజేపీలో చేరిన ఈటల, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అప్పులు తెస్తున్నారంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అంతకుముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలకు గల్ల పెట్టెను అప్పగిస్తే ఏం చేశారని నిలదీశారు. రానున్న రోజుల్లో ప్రజలే ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాగా, బీఐసీటీ నిర్వాహకుడు శరత్‌కుమార్ వినోద్‌కుమార్‌తో అతిథులను ఘనంగా సన్మానించారు.
విద్యార్థులతో ముచ్చట.. వాలీబాల్ ఆట
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జమ్మికుంటకు వచ్చిన వినోద్‌కుమార్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారితో కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. భవిష్యత్‌లో ఏం అవుతారు ఇంజినీరా, డాక్టరా, పోలీసా అంటూ అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం కాసేపు సరదాగా వా లీబాల్ ఆడారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలని కోరారు.
ఒక్క మహిళా సంఘ భవనమైనా నిర్మించారా..?: ఎమ్మెల్సీ కౌశిక్
అభివృద్ధి పథంలో సాగుతున్న జమ్మికుంటను దుమ్ముకుంటగా మార్చిన ఘనత ఏడేండ్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల రాజేందర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ఒక్క మహిళా సంఘ భవనమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు సర్కారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నాయిని చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మున్సిపల్ చైర్మపర్సన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమా ఆగర్వాల్, కేడీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మార్కెట్ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ రాజ్, ఎంఈవో శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, సహకార సంఘం చైర్మన్లు పాల్గొన్నారు.