సిరిసిల్ల/ముస్తాబాద్, జూన్ 17;ఆ బడి పిల్లల కష్టం తీరింది. అమాత్యుడి చొరవతో మూడు కిలోమీటర్ల నడక యాతన దూరమైంది. పరుశురాంనగర్ నుంచి చీకోడుకు నడవలేకపోతున్నామని సైకిళ్లు ఇప్పించాలని ఇటీవల గ్రామానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు విన్నవించగా, అప్పటికప్పుడే సమస్య పరిష్కారమైంది. హామీ ఇచ్చిన 24గంటల్లోగా 25 సైకిళ్లు స్కూల్‌కు చేరుకోవడం, శుక్రవారం పంపిణీ చేయడంతో విద్యార్థులు ఆనందపడ్డారు. తమ కష్టం తీర్చిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ముస్తాబాద్ మండలం చీకోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 78 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదే పాఠశాలలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట జిల్లా సరిహద్దులో దుబ్బాక నియోజకవర్గంలోని పరశురాంనగర్కు చెందిన 25 మంది పిల్లలు చదువుతున్నారు. అయితే కొన్నేండ్లుగా ఆ గ్రామ విద్యార్థులు కాలినడకన లేదా ఇతరుల సాయంతో పాఠశాలకు చేరుతున్నారు. ప్రతి రోజు పాఠశాల సమయం కంటే గంట ముందు కాలినడకన బయలుదేరుతున్న విద్యార్థులు పాఠశాల మొదలయ్యాక గంట తర్వాత ఇంటికి చేరుతున్నారు.
వరంలా మంత్రి పర్యటన..
ఈ నెల 15 మంత్రి కేటీఆర్ చీకోడులో పర్యటించడం విద్యార్థులకు వరంలా మారింది. పాఠశాలకు వ చ్చి డిజిటల్ తరగతులు ప్రారంభించిన మంత్రికి విద్యార్థులు తమ గోడును వెల్లబోసుకున్నారు. తాము నిత్యం దాదాపు మూడు కిలోమీటర్లు పాఠశాలకు నడిచివస్తున్నామని నివేదించారు. వెంటనే చలించిన మంత్రి కేటీఆర్ 25 మంది విద్యార్థులకు సైకిళ్లు అందిస్తామని హామీ ఇచ్చి, 24 గంటల్లోనే నెరవేర్చారు. స్కూల్‌కు సైకిళ్లు చేరుకున్నాయి. ఒక్కో సైకిల్ ధర దాదాపుగా రూ.5వేల దాకా ఉంటుంది.
సైకిళ్ల పంపిణీ..
మంత్రి దత్తత గ్రామమైన చీకోడు బడిలో చదువుతున్న పరుశురాంనగర్కు చెందిన 12 మంది బాలికలకు, 13 మంది బాలురకు సైకిళ్లను స్థానిక నేతలు, ఉపాధ్యాయులు శుక్రవారం అందించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, చీకోడు సర్పంచ్ రజిత, ఎంపీటీసీ సవిత, మాజీ సెస్ డైరెక్టర్ ఎనుగు విజయరాంరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బోంపల్లి సురేందర్‌రావు, ఉపసర్పంచ్ నాగరాజుగౌడ్, మండల కోఅప్షన్ సభ్యులు షాదుల్ పాపా, ఎఎంసీ డైరెక్టర్ రాజమల్లు, హెచ్ఎం భాస్కర్, నాయకులు సుధాకర్‌రెడ్డి, ఆంజనేయులు, కొండ శ్రీనివాస్, గూడూరి భరత్, కంచం నర్సింలు, నాగరాజు, లక్ష్మణ్ ఉన్నారు.
మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు..
విద్యార్థులు కోరగానే సైకిళ్లు అందించిన మంత్రి కేటీఆర్‌కు తమ పాఠశాల, టీచర్ల బృందం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పిల్లలంతా సైకిళ్లు రాగానే చాలా సంతోషంగా ఉన్నారు. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటామనే ధీమాతో కనిపిస్తున్నారు. నిత్యం వారు పడే రవాణా కష్టాలను కేటీఆర్ దూరం చేశారు. ఆయనకు విద్యార్థులు రుణపడి ఉంటారు.
– భాస్కర్, హెచ్ఎం
చదువు పూర్తికాగానే సైకిళ్లు ఇచ్చేస్తాం..
నేను పదో తరగతి చదువుతున్న. ఐదేండ్లుగా పాఠశాలకు నడిచే వస్తున్న. ఆ గోస ఎందో మాకు తెలుసు. మేం నడిచి వచ్చే సరికి మొదటి పీరియడ్‌కు అందకపోయేటోళ్లం. దాంతో కొంత చదువు కోల్పోయే వాళ్లం. మంత్రి కేటీఆర్ సార్ మాకు చేసిన సాయాన్ని మరువం. మా చదువు పూర్తికాగానే ఇక్కడ చదువుకునేందుకు వచ్చే వారికి మా సైకిల్‌ను ఇస్తం.
– పర్శ రాజేశ్, పదో తరగతి