కలెక్టరేట్, జూన్ 17: నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నిర్వహణ బాగుందని రాష్ట్ర మానవ హకుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య కితాబిచ్చారు. నగరంలోని కార్ఖానాగడ్డలో గల వయోవృద్ధుల ఆశ్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ, వయోధికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం వృద్ధాశ్రమం నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తన పరిశీలనలో వెల్లడైందన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు సిబ్బంది అందిస్తున్న సేవలు సొంతింటిని మరిపిస్తున్నాయని పేర్కొన్నారు. వారికి అందిస్తున్న సేవల్లో అధికారులు కనబరుస్తున్న నిబద్ధతతో వయోధికుల్లో మానసిక ఆందోళన దూరమవుతోందన్నారు. మలిసంధ్యలో తల్లిదండ్రులను పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిదని గుర్తించాలన్నారు. సంపన్నులైన, కడు బీదరికం అనుభవిస్తున్న వారైనా తమ పిల్లల భవిష్యత్ కోసం పడే ఆరాటం, అంతా ఇంతా కాదన్నారు. విద్యావంతులైన అనేకమంది తమకున్న వ్యాపార, ఉద్యోగ ఒత్తిళ్లతో తల్లిదండ్రుల ఆలనాపాలన చూడడం మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. వయోధికులను కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు సక్రమంగా చూడడం లేదనే ఆరోపణల నేపథ్యంలో కరీంనగర్లోని ప్రభుత్వ వృద్ధాప్య వసతిగృహాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. రైతులు, వయోధికులు, అనాథలు, పేదలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనందంగా జీవనం సాగిస్తున్నారని ప్రశంసించారు.
విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తుండగా, ఏటా లక్షలాది మంది ఉన్నత విద్యావంతులుగా మారుతుండడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అలాగే, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగాల రాష్ట్రంగా మారబోతుందన్నారు. అంతకుముందు ఆశ్రమంలో వృద్ధులు, దివ్యాంగులు నివసిస్తున్న గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. కల్పిస్తున్న సౌకర్యాలు, పెడుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నట్లు వయోవృద్ధులు పేరొనడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమం ప్రాంగణంలో మొకలు నాటారు. ఆర్డీవో ఆనంద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి పాల్గొన్నారు.