కరీంనగర్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకంలో వాహనాల యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చి గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో దళిత బంధు పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళితబంధు పథకంలో వాహనాల యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. డెయిరీ షెడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
దళితబంధు అనర్హుల జాబితాను పునఃపరిశీలించగా 60 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన కిరాణా షాపులు, సూపర్ మారెట్లు, వ్యాపారం నిర్వహించే లబ్ధిదారులు సేల్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు లావాదేవీలు నమోదు చేసేలా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి చంద్రశేఖర్ గౌడ్, జిల్లా నెహ్రూ యువ కేంద్రం కో-ఆర్డినేటర్ రాంబాబు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
హరితహారం కోసం గుంతలు తవ్వించాలి
కలెక్టరేట్, జూన్ 17 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతల తీత కార్యక్రమం వేగంగా పూర్తిచేయాలని, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో పలు శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం మొదలైన నేపథ్యంలో మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాల్లో గుంతలు తీసేలా చర్యలు చేపట్టాలన్నారు.
మొక్కలు నాటిన అనంతరం వాటిని సంరక్షించేందుకు అవసరమైన ట్రీగార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో రెండు చెరువుల శిఖం భూముల్లో మొక్కలు నాటాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు 10శాతం గ్రీనరీ బడ్జెట్‌ను మొక్కల సంరక్షణకు వినియోగించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి శ్రీలత, అటవీ శాఖాధికారి బాలమణి, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఇరిగేషన్ డీఈలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.