రామడుగు, జూన్ 17: సీఎం కేసీఆర్ కృషితోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీపీ కలిగేటి కవిత పేర్కొన్నారు. మండలంలోని దత్తోజిపేట, వెంకట్రావుపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డ్రైడే పురస్కరించుకొని వెంకట్రావుపల్లిలో అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి పాత టైర్లు, కుండీల్లో నిల్వ ఉన్న నీటిని, మురుగు కాల్వల్లో చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం దత్తోజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలపై చర్చించారు. గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ బండ అజయ్‌రెడ్డి ఎంపీపీని కోరగా సానుకూలంగా స్పందించారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పనులను పరిశీలించిన ఎంపీపీ మొక్క నాటి, నీళ్లు పోశారు. కాగా, వెలిచాలలో నీటి పారుదల శాఖ సహకారంతో మొక్కలు నాటే కార్యాచరణలో భాగంగా కాల్వలు, చెరువు గట్లను అధికారులతో కలిసి సర్పంచ్ వీర్ల సరోజన పరిశీలించారు. చెరువు శిఖం భూములను పరిశీలించి మొక్కలు నాటాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పాతటైర్లు, కుండీల్లో నిలిచిన నీటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జవ్వాజి శేఖర్, బండ అజయ్‌రెడ్డి, పీఆర్ ఏఈ సచిన్, ఎంపీవో సురేందర్, ఎంపీటీసీ కనుకం జయ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కార్యదర్శులు మధునయ్య, మహేందర్, మమత, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 17: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పల్లెప్రగతి కార్యక్రమం జోరుగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని కాల్వలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేశారు. వాగులు, చెరువులు, ఒర్రెల శిఖం హద్దుల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. గత హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోగా వాటి స్థానంలో కొత్తవి నాటారు. గ్రామీణ క్రీడా ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటడానికి గుంతలు తీశారు. డ్రైడేలో భాగంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మురుగు కాల్వలు, వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడంతో పాటు వినియోగించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూన్ 17: పట్టణంలోని 9, 10, 11వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ర్టాన్ని ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ హరితహారం, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. పట్టణ పరిశుభ్రత, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. వార్డు కౌన్సిలర్ జెర్రిపోతుల మొండయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు చింతల సత్యనారాయణరెడ్డి, గండు రాంబాబు, స్వర్గం వజ్రాదేవి, వార్డు ఇన్చార్జులు బోగ రమేశ్, అబ్దుల్ అలీ, ఉమ్మెంతుల భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.