బోయినపల్లి, జూన్ 17 : రాష్ట్ర సర్కా రు సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేస్తూ.. పేదలకు అండగా నిలుస్తున్నది. తాజాగా బోయినపల్లిలో బీజేపీ కార్యకర్త కుటుంబానికి బీమా సాయం అందించింది. బోయినపల్లికి చెందిన రైతు ద్యావ చంద్రారెడ్డికి భార్యా, కొడుకు, బిడ్డ ఉన్నారు. బిడ్డకు ఐదెళ్ల క్రితం పెళ్లి కాగా, కొడుకు అనిల్‌రెడ్డి కొంతకాలం బీజేపీ కార్యకర్తగా పనిచేశాడు. ఏడాదిన్నర క్రితం గల్ఫ్ వెళ్లాడు. అయితే చంద్రారెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఆయన పేరు మీద మూడెకరాల వ్యవసాయ భూమి ఉండడంతో సర్కారు రైతు బీమా వర్తింప జేసింది. శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 5 లక్షల రైతు బీమా ప్రొసిడింగ్ కాపీని చంద్రారెడ్డి భార్య పద్మకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతులకు ప్రభుత్వం అండ దండగా ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.