కమాన్చౌరస్తా, జూన్ 16: శ్రీచైతన్య విద్యాసంస్థల్లో అటానమస్ స్థాయిలో విద్యనందిస్తున్నట్లు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో గల శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాల 25వ వార్షికోత్సవం గురువారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వీసీతో పాటు ఎస్యూ వోఎస్డీ డాక్టర్ వన్నాల రమేశ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మల్లేశ్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి సాంకేతికంగా అభివృద్ధి చెందాలని, డిగ్రీ కోర్సులతో అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. ఎస్యూ వోఎస్డీ వన్నాల రమేశ్ మాట్లాడుతూ, డిగ్రీ కోర్సుల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్నదని, ఇది శుభపరిణామం అని పేర్కొన్నారు.
విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నం
25 ఏళ్ల కింద 90 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ కళాశాల ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యనందిస్తూ సుమారు 20 వేల విద్యార్థులతో ముందుకు సాగుతున్నదని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. 25 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులను చైతన్య వంతులను చేసి, ప్రభుత్వ, ప్రైవేట్, జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు చేసేలా విద్యావ్యవస్థకు సహకారం అందించినట్లు చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరుగా తమ శ్రీచైతన్య విద్యాసంస్థలు కొనసాగుతున్నయని చెప్పడానికి గర్వంగా ఉందనడంలో అతిశయోక్తి లేదన్నారు. అనంతరం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, సదాశివ శర్మ తదితరులను వీసీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమానికి రేలారే రేలా గాయని శిరీష హాజరై ‘బావల నా బావల.. ఏమే పిల్ల అన్నప్పుడళ్ల.. ఎడతిన్నవురో రాతిరి..’ పాటలు విద్యార్థుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ శ్రీనివాస్, గోపాల్రావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.