కోర్టు చౌరస్తా, జూన్ 16: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 26న జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సుజయ్ తెలిపారు. లోక్‌అదాలత్‌కు సంబంధించి గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ కేసులు, కుటుంబ తగాదాలకు సంబంధించిన, బ్యాంక్, చిట్‌ఫండ్, చెక్‌బౌన్స్, ఫ్రీ లిటిగేషన్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో రాజీపడదగిన క్రిమినల్, సివిల్, ఇతర కేసులు 39,816 పెండింగ్‌లో ఉన్నాయని, ఈ లోక్ అదాలత్‌కు సంబంధించి వాటిలోని 3,095 కేసులను గుర్తించి వాటిలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
నోటీసులు అందినవారు వారి కేసులను లోక్‌అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరించుకొనేందుకు ముందుకు రావాలని కోరారు. క్రిమినల్ కేసుల్లో సంబంధిత పోలీసులు, సివిల్ కేసులో న్యాయవాదులును, లోక్‌అదాలత్ సిబ్బందిని సంప్రదించి కేసుల పరిష్కారానికి సంబంధిత వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. కేసులు రాజీద్వారా పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే శ్రమ, సమయం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని, ఇరు పార్టీల మధ్య మంచి స్నేహపూరిత సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకోవాలని సుజయ్ కక్షిదారులకు సూచించారు.