గంగాధర, జూన్ 16: పల్లెప్రగతి కార్యక్రమంతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వెంకటాయపల్లిలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనులను గురువారం ఆయన పరిశీలించారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మురుగు కాల్వలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని పంచాయతీ పాలకవర్గానికి సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడానికి సన్నద్ధం కావాలని సూచించారు. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమల్ల మేఘరాజు, ఉపసర్పంచ్ వేముల శ్రీధర్, నాయకులు వంగల మల్లికార్జున్, నరుకుల్ల గంగయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో కొనసాగుతున్న పల్లెప్రగతి
మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి గురువారం 14వ రోజు కొనసాగింది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర నిర్వహించారు. మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించారు. గత హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోగా వాటి స్థానంలో కొత్తవి నాటారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభ నిర్వహించి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత శాఖ అధికారులకు పంపించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మురుగు కాల్వలు, వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడంతో పాటు వినియోగించవద్దని సూచించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామడుగు, జూన్ 16: పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీపీ కలిగేటి కవిత పేర్కొన్నారు. మండలంలోని షానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం రాత్రి ఆమె అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పల్లెనిద్ర చేశారు. గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచించారు. గురువారం ఉదయం షానగర్ నుంచి రామడుగు వెళ్లే ప్రధాన రహదారి పక్కన మొక్కలు నాటి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పల్లేరు చెట్లు మొలిచిన పల్లెలు నేడు బంగారు పంటలతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.
షానగర్ మండలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ముందు వరుసలో నిలుస్తుందన్నారు. గ్రామంలో రహదారికి ఇరువైపులా రెండు వరుసల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. అలాగే, వెలిచాలలో హరితహారం మొక్కలు నాటేందుకు సర్పంచ్ వీర్ల సరోజన స్థలాలను గుర్తించారు. ఉపాధిహామీ పనులను పరిశీలించి, కూలీలకు జాబ్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, మండల విద్యాధికారి అంబటి వేణుకుమార్, ఎంపీవో సురేందర్, పశువైద్యాధికారి అనిల్‌కుమార్, ఏపీవో రాధ, పీఆర్ ఏఈ సచిన్, ఏపీఎం ప్రభాకర్, వీడీసీ చైర్మన్ సైండ్ల కరుణాకర్, ఉప సర్పంచ్ గునుకొండ వెంకటనర్సయ్య, కార్యదర్శి మధునయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మన్నె కిషన్‌చందర్, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, పెంటి శంకర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, పెద్దిగారి శ్రీనివాస్, కరుణ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి పట్టణంలో..
పట్టణ ప్రగతి కార్యక్రమంతో వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పేర్కొన్నారు. పట్టణంలోని 10వ వార్డులో గురువారం ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో కొత్తపల్లి మున్సిపల్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గండు రాంబాబు, శానిటరీ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ, వార్డు ఇన్చార్జి రమేశ్, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.