కోహెడ, జూన్ 16: తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మిస్తూ సాగునీటి కష్టాలను దూరం చేస్తున్నారని కొనియాడారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి గురువారం ఆయన కోహెడ మండలంలో పర్యటించారు. శ్రీరాములపల్లిలో రైతువేదిక, గొట్లమిట్టలో మహిళా సంఘ భవనం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. వరికోలులో రైతువేదిక, ముదిరాజ్ కమ్యూనిటీ భవనం, తంగళ్లపల్లిలో పల్లె ప్రకృతివనం, గ్రామీణ క్రీడా మైదానం, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శనిగరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల వినోద్ మాట్లాడారు. రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమేనని, ప్రాజెక్టులు పూర్తికావచ్చాయని, ఆ ఫలాలు ఇప్పటికే అందుతున్నాయని చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. నాడు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను అడ్డుకున్నాయని, ఇప్పుడు గౌరవెల్లిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఆగం చేస్తున్నాయని విమర్శించారు. కానీ, సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. నాడు నీళ్లు, నిధులు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని, నేడు రాష్ట్రం వచ్చాక కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయన్నారు. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న ఆనాటి నాయకులకు 24గంటల ఉచిత కరెంట్ సరఫరాతో గుణపాఠం చెప్పామన్నారు.
బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేదని, ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తేలేకపోయాడని ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మాట్లాడారు. హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేసే గౌరవెల్లి ప్రాజెక్టును బీజేపీ, కాంగ్రెస్ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.5 నుంచి 8.4 టీఎంసీలకు పెంచి పూర్తిచేశామన్నారు. 98.2 శాతం మంది రైతులకు డబ్బులు ముట్టాయని, మిగిలిన 1.8 శాతం మంది రైతుల సమస్యలు ఉన్నాయని, కోర్టులు, ఇంటి వివాదాలు పోను కొంత మందికే డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.