జమ్మికుంట, జూన్ 14 : వాళ్లు ముగ్గురన్నదమ్ములు వెంకటేశ్, వెంకటేశ్వర్లు, తిరుపతి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హన్మాండ్లపల్లి. ఒకరు పీజీ, ఇద్దరు డిగ్రీ చదవినా పాలవ్యాపారం చేయాలనేది కోరిక. పేదరికం కారణంగా ఇన్నాళ్లూ నెరవేరలేదు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు తీసుకురావడం, అందులోనూ హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడం వారికి వరమైంది. మొదటి దశలో వెంకటేశ్‌కు యూనిట్ మంజూరు కావడంతో అతను డెయిరీ ఫాం పెట్టుకుని నెలకు 20 వేలకుపైగా సంపాదిస్తున్నాడు. వెంకటేశ్వర్లు కూడా నేడో రేపో దళితబంధు కింద డెయిరీ యూనిట్ పెట్టుకోనుండగా, ఇక తిరుపతి కూడా ‘పాడి’బాటలో నడుస్తానని చెబుతున్నాడు.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హన్మాండ్లపల్లెకు చెందిన బొల్లి రమ-సమ్మయ్యకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు వెంకటేశ్ పీజీ, వెంకటేశ్వర్లు, తిరుపతి డిగ్రీ పూర్తి చేశారు. పై చదువులు చదివినా వారికి పాల వ్యాపారం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది. అయితే, పేదరికం అడ్డువచ్చేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకం వారికి వరమైంది. వెంకటేశ్ మొదటి దశలో పథకానికి ఎంపిక కాగా, డెయిరీ ఫాంను ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగు గేదెలతో నెలకు 20 వేలు సంపాదిస్తున్నాడు. ఖర్చులన్నీ పోనూ 10 వేలకు పైనే మిగులుతున్నాయని చెబుతున్నాడు.
ఇటీవల వెంకటేశ్వర్లుకు దళిత బంధు డెయిరీ ఫాం యూనిట్ మంజూరైంది. తొలి విడుత కింద 5 లక్షలు వచ్చాయి. గేదెల కోసం హర్యానా వెళ్తున్నాడు. ఇక, తిరుపతికి దళిత బంధు వచ్చింది. పెళ్లి తర్వాత తీసుకుంటానని సంబురంగా చెప్పాడు. అన్నల్లాగే డెయిరీ ఫాం.. లేకుంటే ఆటో స్టోర్ అయినా ఏర్పాటు చేసుకుంటానని గర్వంగా చెబుతున్నాడు. ఒకే ఇంట్లోని అర్హులైన అన్నదమ్ములకు మూడు యూనిట్లు మంజూరు కావడంపై కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘పనిజేసుకుందామంటే అవ్వయ్యలే పైసా పెట్టుబడికి నమ్ముతలేరు. చేతికిత్తలేరు. అట్లాంటిది.. దళిత బంధు పథకంల సీఎం కేసీఆర్ ఒక్కొక్కలకు 10 లక్షలు ఇత్తన్రు. బాగుపడేలాజేత్తన్రు.’ అంటున్నరు.. ఈ ముగ్గురన్నదమ్ములు.