కార్పొరేషన్, నవంబర్ 18: అనాథ వృద్ధులకు సేవలందించడం అభినందనీయమని మేయర్ వై సునీల్‌రావు కొనియాడారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని గురువారం ఆయన సందర్శించారు. వృద్ధాశ్రమానికి కోతిరాంపూర్‌కు చెందిన దొంతుల శంకరయ్య అందించిన మినీ వ్యాన్‌ను మేయర్ ప్రారంభించారు. ఆశ్రమానికి వివిధ రకాలుగా సేవలందించిన పలువురిని శాలువాలతో సతరించి, అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని పేర్కొన్నారు. నిస్వార్థ సేవలతోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయన్నారు. మానవతా దృక్పథంతో సేవలు చేసినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుందన్నారు. అనాథ వృద్ధుల కోసం దొంతుల శంకరయ్య మినీ వ్యాన్ ఇవ్వడం హర్షణీయమన్నారు. మినీ వ్యాన్‌ను వృద్ధాశ్రమంలో అనారోగ్యంతో ఉన్న వృద్ధులను దవాఖానకు తరలించడంతో పాటు వివిధ ఫంక్షన్ హాళ్లలో మిగిలిన ఆహార పదార్థాలను వృద్ధాశ్రమానికి చేరవేయడానికి ఉపయోగిస్తారని తెలిపారు. శుభకార్యాల్లో ఆహార పదార్థాలు మిగిలితే వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమానికి సమాచారం అందించాలని కోరారు. నిస్వార్థంగా అనాథ వృద్ధులను అకున చేర్చుకొని సేవలందిస్తున్న వీరమాధవ్ను ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమంలోని వృద్ధులకు ఆసరా పింఛన్ వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ఆకుల ప్రకాశ్, నిర్వాహకుడు సీపెల్లి వీరమాధవ్, దాత శంకరయ్య, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్‌లోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం సాయంత్రం చేపట్టనున్న అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజకు సంబంధించిన పోస్టర్‌ను మేయర్ వై సునీల్‌రావు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పూజను టీఆర్ఎస్ నాయకుడు ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్, నాయకులు కృష్ణగౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.