ముస్తాబాద్, జూన్ 14: ముస్తాబాద్ మండలం పోతుగల్ శివకేశవ ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలకు ఆలయ కమిటీ సర్వం సిద్ధమవుతున్నది. నేటి నుంచి విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు మొదలు కానుండగా, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు స్వాగతం పలుకుతూ పోతుగల్ ఆలయం నుంచి మండల కేంద్రం దాకా భారీ కటౌట్లు, రంగురంగుల విద్యుద్దీపాలు, ఆలయం పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడేలా చెట్లు, పిల్లలను ఆకట్టుకునే విధంగా పార్కులో పరికరాలు, శ్రీరాముడు, బోలాశంకరుల విగ్రహాలు తీర్చిదిద్దారు.
రెండు ఆలయాల్లో జరిగే కార్యక్రమాలకు యాగశాలలు సిద్ధం చేశారు.తొలి రోజు రెండు వేల మంది భక్తులకు భోజన వసతి, మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు వర్షం పడ్డా తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లతో వేదికలు ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ఆలయాలు చూడగానే భద్రాద్రి శ్రీసీతారాముల ఆలయం గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దారు. గురువారం నుంచి శుక్రవారం వరకు (17వ తేదీ) శివాలయంలో.. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రామాలయంలో ప్రత్యేక పూజలతోపాటు విగ్రహ, ధ్వజస్తంభ, ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.
ప్రముఖులకు ఆహ్వానం..
సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ రవిచంద్రతోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపార వేత్తలను ఆహ్వానించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
రూ.4 కోట్లతో పునర్నిర్మాణం
సిరిసిల్లకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోతుగల్. మండల కేంద్రం నుంచి కేవలం 2కిలోమీటర్ల దూరాన ఉంటుందీ గ్రామం. గ్రామ సమీపంలోని గుట్టబోరుపై శివకేశవ ఆలయాలు ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఇక్కడ ఏటా చైత్ర పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు, మాఘమాస రోజున ధనుర్మాసంలో శ్రీ గోదారంగనాయక స్వామి కల్యాణం వేడుకలు నిర్వహిస్తారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు కావడంతో శిథిలావస్థకు చేరగా, గ్రామస్తులు ఒక్కటై నూతనంగా నిర్మించాలని సంకల్పించారు. సుమారు 4 కోట్ల వ్యయంతో చినజీయర్ సూచనలపై వాస్తు ప్రకారం పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అభివృద్ధితోపాటు పర్యాటకులు, పిల్లలకు ఆహ్లాదం కోసం 50 లక్షలతో పార్కు ఏర్పాటు చేశారు.