బోయినపల్లి, జూన్ 14: బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి ఆలయంలో సత్యదత్త వ్రతాలు, అభిషేక కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. దత్తాత్రేయుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి జ్ఞాపికను అందించారు. శ్రీనివాస్ గుపా మాట్లాడుతూ దత్తాత్రేయ ఆలయం చుట్టూ తొమ్మిది నెలలపాటు మధ్యమానేరు జలాశయం లో నీరు నిలిచి ఉంటుండడంతో దత్త జయంతి వేడుకలకు ఇబ్బందవుతున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారని,ఈ క్రమంలో టూరిజం శాఖ తరపున బోట్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇంకా మంత్రులు కేటీఆర్, కమలాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవీందర్రావు, ఎమ్మెల్యే రవిశంకర్‌తో చర్చించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే భక్తులకు దర్శనం కల్పించేందుకు 40 సీట్ల బోట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సత్యదత్త వ్రతాల్లో పాల్గొని దత్తాత్రేయుడిని దర్శించుకున్నారు. ఇక్కడ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ ఆరేపలి లత, మాజీ ఉప సర్పంచ్ గొట్ల రేణుక, టీఆర్ఎస్ నాయకులు ఈడ్గు స్వామి, ఆరేపల్లి రాజు, గొట్ల వెంకటేశ్, నాగుల సాంబయ్య, ఆడేపు రాజు ఉన్నారు.