చొప్పదండి, జూన్ 14: యువత సన్మార్గంలో నడిచేలా చూడాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ‘నమస్తే తెలంగాణ’ మినీలో ‘చొప్పదండిలో యువత పెడదారి’ అనే శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సీఐతో పాటు చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల ఎస్ఐలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మూడు మండలాల్లో యువత సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాత్రి 9 గంటల తర్వాత బైక్‌లపై అతివేగంగా, అజాగ్రత్తగా తిరిగినా, గుంపులు గుంపులుగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి పైరవీలకు తావివ్వకూడదని ఆదేశించారు. యువత సన్మార్గంలో నడిచేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో సీఐ రవీందర్, మూడు మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు.
వీరంగం చేసిన యువకుల బైండోవర్
చొప్పదండి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వీరంగం చేసిన యువకులను సీఐ రవీందర్, ఎస్ఐ రాజేశ్ అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ చేశారు. యువకులపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు. పట్టణంతో పాటు మండలంలో రాత్రి వేళల్లో యువత అనవసరంగా రోడ్లపై తిరిగినా, గుంపులు గుంపులుగా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.