రామడుగు, జూన్ 14: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని ఎంపీపీ కలిగేటి కవిత పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మంగళవారం 12వ రోజు మండలంలోని కొరటపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. కొరటపల్లిలో ఇంటింటికీ వెళ్లి కుండీలు, పాత టైర్లు, డబ్బాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. లక్ష్మీపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, క్రీడా ప్రాంగణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పెడుతున్న పోషకాహారంపై ఆరా తీశారు.
గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేస్తున్నారని, పిల్లలను పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అనంతరం గ్రామంలో పర్యటించి మురుగు కాల్వలను పరిశీలించారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులకు డ్రైడే గురించి వివరించారు. అలాగే, వెలిచాల గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా సర్పంచ్ వీర్ల సరోజన అధికారులు, సిబ్బందితో కలిసి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ తీశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన చేశారు.
ఈ కార్యక్రమాల్లో సర్పంచులు మన్నె దర్శన్రావు, చిలుముల రజిత, మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఉప సర్పంచులు ఎడవెల్లి శ్రీకాంత్‌రెడ్డి, ముచ్చంతల నరేందర్‌రెడ్డి, పూదరి వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శులు మధునయ్య, శ్రీనివాస్, గ్రామ పత్యేకాధికారి రాజేశ్, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, చిలుముల ప్రభాకర్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 14: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర నిర్వహించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. డ్రైనేజీలు, మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేశారు. మురుగు కాల్వలు, వీధులను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లారు. దోమల నివారణకు వీధుల్లో ఫాగింగ్ చేయాలని నిర్ణయించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడంతో పాటు వినియోగించవద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.