కార్పొరేషన్, జూన్ 14: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం ఆయన 18వ డివిజన్లో పర్యటించారు. డివిజన్లో క్రీడా ప్రాంగణం, మారెట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, ఇంటి పరిసరాల్లో పాత డబ్బాలు, కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఎదుల్ల రాజశేఖర్, డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్, శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని 9వ డివిజన్లో పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం డ్రై డే నిర్వహించారు. డివిజన్లో పర్యటించి ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్ మాట్లాడుతూ, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని సూచించారు. వారానికో రోజు డ్రైడే పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 11వ డివిజన్లో కార్పొరేటర్ ఆకుల నర్మద ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డివిజన్లో పర్యటించి ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేకాధికారి నవీన్‌కుమార్, డాక్టర్ మమాలిక, ఏఎన్ఎం సంపూర్ణ, అనూషా బేగం, ఆనందం పాల్గొన్నారు.