కార్పొరేషన్, జూన్ 13: కరీంనగరంలో పచ్చదనం వెల్లివిరిసేలా అత్యధికంగా మొకలు నాటి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. నగరం నుంచి వెళ్లే ప్రధాన రహదారుల వెంట మూడు వరుసల్లో పూలు, ఇతర మొకలు నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ప్రవేశం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో 14కిలో మీటర్ల మేర ఆకర్షణీయంగా రోడ్డుకు మధ్య, ఇరువైపులా దట్టమైన అటవీ ప్రాంతాన్ని తలపించేలా మొకలను నాటడానికి ప్రణాళికను రూపొందించాలన్నారు. ఇందుకోసం రూ.50లక్షల నిధులను కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మొకల ఎంపికలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, త్వరగా పెరిగే మొకలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మొకల కోసం అవసరమైతే కడెం, ఇతర ప్రాంతాలకు అధికారులు వెళ్లి రావాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్, జిల్లా అటవీశాఖ అధికారి సీహె చ్ బాలమణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.