రామడుగు, జూన్ 13: పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎంపీపీ కలిగేటి కవిత పేర్కొన్నారు. మండలంలోని శ్రీరాములపల్లిలో చేపట్టిన పల్లెప్రగతి పనులను సోమవారం ఆమె పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. పల్లెప్రకృతివనం, నర్సరీని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు హాజరైన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో విద్యార్థులను సమీకరించి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వెలిచాలలో రహదారికి ఇరువైపులా ముళ్ల పొదల తొలగింపు కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజన పాల్గొన్నారు. మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెత్తను తొలగించి, పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మురుగునీరు నిల్వకుండా చర్యలు చేపట్టారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, సర్పంచులు వీర్ల సరోజన, పంజాల ప్రమీల, చంటి జీవన్, పీఆర్ ఏఈ సచిన్, ఏపీఎం ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు మధునయ్య, మధుసూదన్, శ్రీకాంత్, నాయకులు కలిగేటి లక్ష్మణ్, పంజాల జగన్మోహన్గౌడ్, ప్రధానోపాధ్యాయులు, ఉ పాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులున్నారు.
గంగాధర మండలంలో..
మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ, ప్రజోపయోగ సంస్థలను శుభ్రం చేయించారు. ప్రభుత్వ భవనాల ఆవరణలో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు తయారు చేశారు. వీధుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగింపజేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. ప్లా స్టిక్ నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులున్నారు.