చొప్పదండి, జూన్ 13: చొప్పదండిలో యువత దురలవాట్లకు బానిసై పెడదారిన పడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణంలో 14-25 ఏండ్లున్న పలువురు యువకులు గుట్కా, గంజాయి, మద్యం, డ్రగ్స్, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డట్లు తెలుస్తున్నది. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై రోడ్లపై తిరుగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. గతంలో పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు ప్రస్తుతం ఆ స్థాయిలో చేపట్టడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పలువురు యువకులు రాత్రి వేళ రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. సరైన రీతిలో పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు కొద్ది రోజులుగా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి 11.30గంటలకు సంతోష్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలో 15మందికి పైగా యువకులు మద్యం, గంజాయి మత్తులో కట్టెలతో దాడి చేసుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న కార్లు, లారీలను ఆపుతూ నానా భీభత్సం సృష్టించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు ఆలస్యంగా స్పందించారు. కాగా, పట్టణానికి చెందిన ఒకరు అర్ధరాత్రి వేళ గంజాయి సరఫరా చేస్తుండగా యువకులు బానిసలవుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తే మళ్లీ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. శాంతిభద్రతలకు మారుపేరుగా నిలిచి జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలిచిన చొప్పదండి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతుండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి చొప్పదండి మండలంలో రాత్రివేళ పెట్రోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించి అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
పెట్రోలింగ్ నిర్వహించి నియంత్రిస్తాం
చొప్పదండిలో యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారనే సమాచారం ఉంది. వారిని సన్మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. రాత్రి 9 తర్వాత అనవసరంగా యువకులు రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటాం. రోడ్లపై వీరంగం చేస్తూ కనబడితే 100కు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించి ఇలాంటి చర్యలను నియంత్రిస్తాం.
– రవీందర్, సీఐ, చొప్పదండి